Pawan Kalyan: తెలంగాణలో దోచుకుంటున్నారని పంపించేశారు.. మళ్లీ ఆంధ్రావాళ్లకే కాంట్రాక్టులిచ్చారు: పవన్ కల్యాణ్
- పోలవరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు
- రాజులు మారారు కానీ, మళ్లీ దోపిడీ అదే జరుగుతోంది
- యువతే దేశపు సంపద
- అటువంటి యువత కోసం ఏం చేస్తున్నారు?
'రాజకీయ వ్యవస్థలో జరుగుతోన్న తప్పులు నాకు తెలుసు. పోలవరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణలో అప్పట్లో నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని పంపించేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల కాంట్రాక్టులను మళ్లీ ఆంధ్రావాళ్లకే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది' అని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ రోజు విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ... 'రాజులు మారారు కానీ, మళ్లీ దోపిడీ అదే జరుగుతోంది... ఏం మారలా.. ఒక దేశపు సంపద అంటే ఖనిజాలు కాదు, నదులు కాదు.. యువత మాత్రమే. వారే దేశ భవిష్యత్తుకి నాయకులు. అలాంటి యువత కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? యువత అంటే నారా లోకేశ్ కాదు.. యువత అంటే ఓ దివంగత ముఖ్యమంత్రి కుమారుడు కాదు. యువతకు అవకాశాలు కల్పించాలంటే ఇటువంటి వారికి అవకాశాలు కల్పించడం కాదు. కొంతమంది యువత కష్టపడి చదువుకున్నా, స్కాలర్ షిప్ రాక కొంతమంది సమస్యలు ఎదుర్కుంటున్నారు. జనసేన సైనికులు నేను తప్పు చేసినా నిలదీయాలి' అన్నారు.