Cricket: మంత్రి గారికి జట్టు కూర్పు నచ్చలేదట... విమానాశ్రయం నుంచి ఆటగాళ్లను వెనక్కి రప్పించిన శ్రీలంక క్రీడల మంత్రి!
- డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్
- భారత్ బయల్దేరిన 9 మంది శ్రీలంక ఆటగాళ్లు
- ఆటగాళ్లను విమానాశ్రయం నుంచి వెనక్కి పిలిపించిన క్రీడల మంత్రి
సాధారణంగా క్రీడాకారుల ఎంపికను ఆయా క్రీడా ప్రాధికార సంస్థలు చూస్తుంటాయి. ప్రతి ఆటకు ఒక బోర్డు ఉంటుంది. ఎంపికను ఆ బోర్డు నిర్వహిస్తుంటుంది. ప్రధానంగా క్రికెట్ లో అయితే ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు చూస్తుంటాయి. కానీ శ్రీలంక జట్టు ఎంపికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా వన్డే సిరీస్ కు శ్రీలంక జట్టును ఆ క్రికెట్ బోర్డు భారత్ కు పంపేందుకు సిద్ధమైంది. ఎంపికైన తొమ్మిది మంది ఆటగాళ్లు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్ కు కూడా చేరుకున్నారు. కాసేపట్లో చెకిన్ అయితే విమానమెక్కి భారత్ చేరుకుంటారు. ఇంతలో వెనక్కి రావాలని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సూచించింది. దీంతో వన్డే సిరీస్ లో ఆడేందుకు సిద్ధమైన ఆటగాళ్లు వెనక్కి వెళ్లారు.
వారు వెనక్కి వెళ్లడానికి కారణమేంటంటే... ఆ దేశ నిబంధనల ప్రకారం దేశం తరఫున క్రీడల్లో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు ఆ దేశ క్రీడల మంత్రి నుంచి అనుమతులు పొందాలి. ఈ నేపథ్యంలో టీమిండియాతో వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన 9 మంది ఆటగాళ్లకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ బోర్డు సంబంధిత పత్రాలను క్రీడల మంత్రిత్వ శాఖకు పంపింది. ఆటగాళ్ల పేర్లు చూసిన ఆయనకు జట్టు కూర్పు నచ్చలేదు. దీంతో బోర్డు ఎంపిక చేసిన జట్టులో కనీసం రెండు మార్పులు చేయాలని సూచించారు. దీంతో బోర్డు అధికారులు విమానాశ్రయం చేరిన ఆటగాళ్లను వెనక్కి రప్పించారు. అయితే ఆ రెండు మార్పులు ఏంటి? బోర్డు ఎంపిక చేసిన జట్టులో ఎవర్ని తప్పించి, ఎవరికి చోటిచ్చారు అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెల 10 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.