జేసీ దివాకర్ రెడ్డి: రాజకీయాల నుంచి ఈ ఏడాదే తప్పుకుంటా: జేసీ దివాకర్ రెడ్డి
- లాభనష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయం చేసుకుంటా
- ఇన్ పుట్ సబ్సిడీ కన్నా ఎరువులపై రాయితీ ఇస్తే బాగుంటుంది
- కిలో రూపాయి బియ్యాన్ని ఎవరూ తినడం లేదు: జేసీ
తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాను రాజకీయాల నుంచి ఈ ఏడాది నుంచే తప్పుకుంటానంటూ జేసీ ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ దివాకర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల నుంచి ఈ ఏడాదే వైదొలుగుతానని, లాభనష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం రైతులు ఎదురు చూడకుండా కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. కష్టపడే వాడికి ఎక్కడికెళ్లినా కడుపునిండుతుందని చెప్పిన జేసీ, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం కన్నా ఎరువులపై రాయితీ ఇస్తే బాగుంటుందని అన్నారు.
వ్యవసాయం చేసేందుకు అధునాతన యంత్రపరికరాలను రైతులకు అందజేయాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ద్వారా ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాయని, ఆ బియ్యాన్ని ఎవరూ తినడం లేదని ఘాటుగా విమర్శించారు.