Amazon: అమెజాన్‌కు రూ.12.55 లక్షల టోకరా వేసిన ఘనులు.. మాజీ ఉద్యోగులే నిందితులు!
- పథకం ప్రకారం అమెజాన్‌ను మోసం చేసిన నిందితులు
- వస్తువులు బుక్ చేసి అందుకున్నాక రాలేదని ఫిర్యాదు
- మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేసిన అమెజాన్
- నిందితులకు అరదండాలు
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియాను మోసం చేసి రూ.12.55 లక్షల మేర దండుకున్న ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టుకుంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన సిమ్సన్ గుణశేఖర్, జాన్ అరుల్‌లు స్నేహితులు. 2014లో అమెజాన్‌లోని అమెరికా ప్రాసెస్ విభాగంలో గుణశేఖర్ కస్టమర్ సపోర్టు అసోసియేట్‌గా చేరాడు. 2016లో భారత విభాగంలోకి మారాడు. అతడి వ్యవహార శైలిలో తేడాలు రావడంతో సంస్థ అతడిని విధుల నుంచి తొలగించింది.
ఉద్యోగం నుంచి తొలగించడంతో సంస్థ నుంచి సులభంగా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. అదే హోదాలో పనిచేసి, ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైన తన స్నేహితుడు అరుల్‌తో కలిసి ఫిర్యాదుల రూపంలో వివాదం రేపి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశాడు.
2016లో జాన్ క్రిస్ పేరిట అమెజాన్ వెబ్‌సైట్‌లో కస్టమర్ ఖాతాను తెరిచిన గుణశేఖర్ యాపిల్ ఐఫోన్ 5ను ఆర్డర్ చేశాడు. ఫోన్ అందుకున్నాక తనకు ఫోన్ చేరలేదని, బాక్స్‌లో రాళ్లు, రప్పలు ఉన్నాయని, తన డబ్బులు తిరిగి పంపాలంటూ అమెజాన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో సంస్థ అతడికి డబ్బులు వాపస్ చేసింది. ఇలా వివిద రకాల గాడ్జెట్లు బుక్ చేయడం, అందలేదని ఫిర్యాదు చేసి డబ్బులు వెనక్కి తీసుకోవడాన్ని గుణశేఖర్ అలవాటుగా మార్చుకున్నాడు. అలా అందుకున్న వస్తువులను ఓఎల్ఎక్స్‌లో తక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు.
పదేపదే అలాగే జరుగుతుండడంతో గుణశేఖర్‌పై కన్నేసిన అమెజాన్ ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ టీం రూ.12,55,915 మోసం కారణంగా కోల్పోయినట్టు తమ తనిఖీల్లో గుర్తించింది. దీంతో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ, మొబైల్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గుణశేఖర్, జాన్ అరుల్‌లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.