Kuppam: జగన్ కు షాకిస్తూ... వైకాపాకు రాజీనామా చేసిన కుప్పం నేత సుబ్రహ్మణ్యం రెడ్డి!
- పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన కుప్పం నేత
- తనకు అవమానాలు ఎదురవుతున్నాయన్న సుబ్రహ్మణ్యం రెడ్డి
- జగన్ దూరం పెట్టారని కన్నీరు
ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో, పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ కు, ఆయన పార్టీకి చెందిన మరో నేత షాకిచ్చారు. చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కుప్పం ప్రాంతానికి వైకాపా నేత సుబ్రహ్మణ్యం రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైకాపాలో అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నానని కార్యకర్తల ముందు కన్నీటితో చెప్పిన ఆయన, ఇదే విషయాన్ని జగన్ కు రెండు పేజీల లేఖలో వెల్లడించానని అన్నారు.
పార్టీతో ఇన్నాళ్ల అనుబంధాన్ని తెంచుకునే ముందు ఎంతో ఆలోచించానని చెప్పిన ఆయన, రాజశేఖరరెడ్డి హయాంలో తన స్థాయి నుంచి, ప్రస్తుతం జగన్ తనను దూరం పెట్టడం వరకూ జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో పార్టీకి అండగా నిలిచిన తనపై నిందలు వేశారని, తనకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో తాను వైకాపాను ప్రారంభించగానే చేరానని, జగన్ కు విధేయుడిగా ఉన్న తనకు లభించిన గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.
కాగా, సుబ్రహ్మణ్యం రెడ్డి రాజకీయంగా ఎటు పయనిస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన మాతృపార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతారని కొందరు విశ్లేషిస్తుంటే, బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానముందని మరికొందరు అంటున్నారు.