Congress: గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. 200 మంది ఐటీ సెల్ సభ్యులు రాజీనామా!

  • రాజ్‌కోట్‌లోని ఐటీ సెల్ విభాగం మొత్తం రాజీనామా
  • దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ 
  • సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన రాజ్‌కోట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు

గుజరాత్ ఎన్నికల్లో గెలిచి అధికార బీజేపీపై పై‘చేయి’ సాధించాలనుకుంటున్న కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. రాజ్‌కోట్‌లో ఆ పార్టీకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విభాగానికి చెందిన 200 మందికిపైగా సభ్యులు రాజీనామా చేశారు. ఐటీ యూనిట్ మొత్తం రాజీనామాలు సమర్పించడంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితికి చేరుకుంది. సోషల్  మీడియా ప్రచారం ఎలా నిర్వహించాలో తెలియక తలలు పట్టుకుంది.  

కాంగ్రెస్ రాజ్‌కోట్ సిటీ యూనిట్ తమను విస్మరిస్తున్నందుకు నిరసనగానే వీరంతా రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. సభ్యులందరూ కలిసి ఒకే రాజీనామా లేఖను గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐటీ సెల్ చైర్మన్ రోహన్ గుప్తాకు అందించారు. పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా ఐటీ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని, అయినప్పటికీ తమను విస్మరిస్తున్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. యూనిట్ మొత్తం రాజీనామాలు సమర్పించడంతో రాజ్‌కోట్ సిటీ యూనిట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేష్ రాజ్‌పుట్ రంగంలోకి దిగారు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈనెల 9న జరగనుండగా 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 18న ఫలితాలు వెల్లడిస్తారు.

  • Loading...

More Telugu News