frist sms: ఎస్సెమ్మెస్ కి 25 ఏళ్లు.. తొలి ఎస్సెమ్మెస్ 'మేరీ క్రిస్మస్'!
- 1992 డిసెంబర్ 2న తొలి ఎస్సెమ్మెస్ పంపిన పాప్ వర్త్
- మేరీ క్రిస్మస్ అంటూ కంప్యూటర్ నుంచి వొడా ఫోన్ కు ఎస్సెమ్మెస్
- 1993 నుంచి మొబైల్ లో ఎస్సెమ్మెస్ లు పంపే సౌకర్యం కల్పించిన నోకియా
నాలుగైదేళ్ల క్రితం మొబైల్ ఫోన్ కాల్ రేట్లు ఎక్కువగా ఉండడంతో మెసేజ్ లు విరివిగా పంపుకునే వారు. ఇప్పుడు డేటా ఆఫర్లు ఉన్నట్టు అప్పుడు మెసేజ్ ఆఫర్లు ఉండేవి. ఇదంతా స్మార్ట్ ఫోన్ ప్రవేశానికి పూర్వం. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఎస్సెమ్మెస్ ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరికైనా సందేశం పంపాలంటే వాట్స్ యాప్, మెసేంజర్, టెలిగ్రాం, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల సాయం తీసుకుంటున్నారు.
అయినప్పటికీ, ఎస్సెమ్మెస్ విలువ ఎస్సెమ్మెస్ దే.. ఈ ఎస్సెమ్మెస్ కు ఇప్పుడు పాతికేళ్లు నిండాయి. 1992 డిసెంబర్ 2న పాప్ వర్త్ (22) తొలి ఎస్సెమ్మెస్ ను పంపారు. కంప్యూటర్ నుంచి వొడాఫోన్ నెట్ వర్క్ కు ‘మేరీ క్రిస్మస్’ అంటూ ఆయన తొలి ఎస్సెమ్మెస్ ను పంపారు. ఈ విషయం ఇటీవలే తన పిల్లలకు చెప్పానని ఆయన అన్నారు. అయితే తాను పంపిన ఎస్సెమ్మెస్ ఇంత ఆదరణ పొందుతుందని అప్పట్లో తాను భావించలేదని ఆయన పేర్కొన్నారు.
1993లో నోకియా సంస్థ తొలిసారిగా ఎస్సెమ్మెస్ పంపుకొనే సౌకర్యం కలిగిన మొబైల్ హ్యాండ్ సెట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే ఈ ఎస్సెమ్మెస్ లు ఒకే నెట్ వర్క్ మధ్య బదిలీ అయ్యేవి... 1999లో తొలిసారిగా వేర్వేరు నెట్ వర్క్ ల మధ్య సందేశాలు బదిలీ అయ్యాయి.