Hyderabad: మెట్రో ఎఫెక్ట్: తాత్కాలికంగా పెరిగిన ఆర్టీసీ ఆదాయం!

  • అదనంగా 20-25 వేల మంది బస్సు ప్రయాణికులు 
  • రోజుకు అదనంగా రూ.2 లక్షల ఆదాయం
  • మెట్రో ఎక్కేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడమే కారణం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమైతే ఆర్టీసీ బస్సుల్లో ఎవరూ ఎక్కరన్న వాదన తప్పని తేలింది. మెట్రో పరుగులు పెట్టడం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ ఆదాయం మరింత పెరగడం గమనార్హం. గ్రేటర్‌లో ఆర్టీసీ ఆదాయం సగటున రోజుకు రూ.2.88 కోట్లు కాగా, మెట్రో అందుబాటులోకి వచ్చాక  అదనంగా మరో రెండు లక్షలు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రోజువారీ ప్రయాణించే వారు కాకుండా మెట్రో ప్రారంభమైన ఈ మూడు రోజుల్లో అదనంగా మరో 20-25 వేల మంది వరకు ప్రయాణిస్తున్నట్టు తేలింది. మెట్రో ఎక్కేందుకు వారు బస్సుల్లో ప్రయాణించడం వల్లే ఆ ఆదాయం సమకూరినట్టు చెబుతున్నారు.  

నగరంలోని 28 ఆర్టీసీ బస్ డిపోల నుంచి 1700 బస్సులు మెట్రో కారిడార్‌లోని ఏదో ఒక ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్నాయి.  మెట్రో ఎక్కాలనుకునే ప్రజలు వీటిని వినియోగిస్తున్నారు. మరోవైపు మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

మెట్రోలో ఎక్కి తిరగాలన్న నగరవాసుల తహతహతోపాటు, నగరానికి వస్తున్నవారు మెట్రో తొలి ప్రయాణ అనుభవం కోసం ఆరాటపడడం వల్లనే ఆర్టీసీ ఆదాయం పెరిగినట్టు భావిస్తున్నారు. అయితే, ఈ అదనపు ఆదాయం ఎంతకాలం కొనసాగుతుందనేది చూడాలి. 

Hyderabad
Metro Rail
RTC
  • Loading...

More Telugu News