money: పోలవరం పరిహారం ఎంత పని చేసింది?

  • పోలవరం పరిహారంగా 15 లక్షలు అందుకున్న వీరయ్య
  • ఈ విషయం తెలిసి 8 ఏళ్ల తరువాత భర్తను వెతుక్కుంటూ వచ్చిన నాగలక్ష్మి
  • కొన్ని రోజులు బాగానే ఉండి...ఏటీఎం కార్డుతో ప్రియుడి వద్దకు జంప్

'డబ్బు డబ్బు! ఏం చేస్తావు? అని డబ్బుని అడిగితే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడతాను, కుటుంబాలను నిలువునా చీల్చుతాను, బంధాలను సర్వనాశనం చేస్తా, కొత్త బంధాలను పుట్టిస్తానని అంద'ని ఒక రచయిత చెప్పినట్టు... పోలవరం పరిహారం డబ్బు కోసం ఓ మహిళ 8 ఏళ్ల తరువాత భర్త వద్దకు వచ్చి, 9 లక్షలకు టోపీ పెట్టిన ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడేనికి చెందిన దానూరి వీరయ్యకు అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన నాగలక్ష్మికి 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఫలితంగా వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. తరువాత మనస్పర్ధల కారణంగా నాగలక్ష్మి భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. గత ఎనిమిదేళ్లుగా అక్కడే ఉంటోంది. పుట్టింటికి దగ్గర్లో వుండే విజయ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఇదిలావుండగా, గత జూలైలో పోలవరం బాధితుడైన వీరయ్యకు ప్రభుత్వం 15 లక్షల రూపాయల పరిహారం ఇచ్చింది. ఇది తెలిసిన నాగలక్ష్మీ పాత బంధాన్ని గుర్తు చేసుకుని, మళ్లీ వచ్చింది. ఎంతైనా భార్యే కదా, తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చిందని భావించిన వీరయ్య ఆమెతో సర్దుకుపోయాడు. కొన్నాళ్లు మంచిగా ఉన్న నాగలక్ష్మి... వీరయ్య డబ్బులు బ్యాంకులో ఉన్నాయని తెలుసుకుని, అడిగితే ఇవ్వడని చెప్పి, తన ఏటీఎం కార్డు వీరయ్య కార్డు స్థానంలో ఉంచి, అతని డెబిట్ కార్డు పట్టుకుని ప్రియుడి దగ్గరకు ఉడాయించింది. వారం క్రింతం డబ్బు అవసరమైన వీరయ్య తన ఏటీఎం కార్డు కోసం వెతకగా, నాగలక్ష్మి చేసిన భాగోతం బట్టబయలైంది.

దీంతో ఆదరాబాదరాగా బ్యాంకుకు వెళ్లి ఆరాతీయగా, అప్పటికే 9 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి స్వాహా చేసినట్టు తేలింది. ఈ డబ్బును పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి డ్రా చేసినట్టు తెలిసింది. దీంతో వీరయ్య వినాయకాపురం పెద్దమనుషుల సమక్షంలో నాగలక్ష్మిని నిలదీయగా, గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో గ్రామస్థులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో తమకింకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News