sunil ambrin: క్రికెట్ చరిత్రలోనే ఇంత వరకు ఇలా జరగలేదు.. విండీస్-కివీస్ టెస్టులో చోటు చేసుకుంది!
- తొలి టెస్టు తొలి బంతికే హిట్ వికెట్
- చెత్త రికార్డు సాధించిన విండీస్ ప్లేయర్ అంబ్రిన్
- స్టంప్స్ ను తాకిన ఎడమ కాలు
క్రికెట్ లో హిట్ వికెట్ గా ఔట్ కావడం సాధారణంగా జరిగేదే. అయితే, తొలి టెస్టు ఆడుతున్న వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ అంబ్రిన్ తన అరంగేట్రం మ్యాచ్ లోనే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికే హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. టెస్ట్ క్రికెట్ లో ఇంత చెత్త రికార్డు ఎవరూ సాధించలేదు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ కే చెందిన సీఎస్ బాహ్ పేరిట ఉండేది. 2003లో తొలి టెస్టు ఆడిన బాహ్ రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగులకు హిట్ వికెట్ గా వెనుదిరిగి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ చెత్త రికార్డును అంబ్రిన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
నీల్ వాగ్నర్ వేసిన 29వ ఓవర్ తొలి బంతిని అంబ్రిన్ ఫైన్ లెగ్ మీదుగా తరలించాడు. అయితే, పొరపాటున అతని ఎడమ కాలు స్టంప్స్ ను తాకింది. దీంతో, అతను ఎంతో నిరాశగా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్ తొలి బంతికే అతడిని ఆ విధంగా దురదృష్టం వెంటాడింది.