Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచి ‘భీం’ ద్వారా టికెట్ బుకింగ్!
- క్రెడిట్, డెబిట్ కార్డులకు చెల్లుచీటీ
- ఇకపై భీం యాప్ ద్వారా టికెట్ బుకింగ్ సౌలభ్యం
- నేటి నుంచే అమల్లోకి..
రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో తీపి కబురు చెప్పింది. డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయడంలో భాగంగా నేటి నుంచి ‘భీం’ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదుకు బదులు ఇక ఎంచక్కా ‘భీం’ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు (ట్రాఫిక్) సభ్యుడు మహ్మద్ జంషెడ్ తెలిపారు.
గతేడాది పెద్ద నోట్లు రద్దు చేయడానికి ముందు 58 శాతం రైలు టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అయ్యేవి. నోట్ల రద్దు తర్వాత 70 శాతానికి పెరిగింది. కేవలం 30 శాతం మంది ప్రయాణికులు మాత్రమే నగదుతో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. 3-5 కోట్ల మంది ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులకే ఇష్టపడుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే దేశంలోని దాదాపు అన్ని స్టేషన్లలో స్వైపింగ్ యంత్రాలు అమర్చామని, ప్రయాణికులు ఇక డిజిటల్ పద్ధతిలో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని జంషెడ్ వివరించారు.