Telugudesam: బీజేపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబును నియంత్రించాలనే దుర్బుద్ధి కనిపిస్తోందన్న ఎంపీ!
- ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ చూస్తోంది
- ఏపీతో పెట్టుకుంటే మూడేది వారికే
- పోలవరాన్ని ఆపితే దేశంలోనే అతిపెద్ద తిరుగుబాటు తథ్యం
టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మరీ కేంద్రం చుట్టూ తిరుగుతుంటే, కేంద్రం మాత్రం ఆయనను నియంత్రించాలనే దుర్బుద్ధితో ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు. బీజేపీ ఆకలితో ఉందని, ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని అన్నారు. అందుకనే పోలవరం విషయంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు.
పోలవరం విషయంలో ఏవైనా అనుమానాలుంటే అడిగి తెలుసుకోవాలి కానీ పిలిచిన టెండర్లను ఆపాలనడం సరికాదని జేసీ అన్నారు. ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఇది వాళ్ల జాగీరూ కాదు, తాము బానిసలమూ కామని అన్నారు. పోలవరాన్ని ఆపాలని ప్రయత్నిస్తే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం అక్కడి వరకు తెచ్చుకోదనే భావిస్తున్నామన్నారు. తరచి చూస్తే పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పాలనా పరమైనవిగా అనిపించడం లేదని, రాజకీయ కారణాలతోనే అలా చేస్తుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్రం కనుక ఏపీతో వైరం పెట్టుకుంటే మూడేది వారికేనని జేసీ హెచ్చరించారు. డిసెంబరు 15 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో అంతకుముందే దీనిని సరిదిద్దాలని జేసీ కోరారు.