mckinsey report: 2030 నాటికి ఇండియాలో 11-12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం: ప్రపంచ ప్రఖ్యాత మెకిన్సే నివేదిక
- 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు
- టాప్ ప్లేస్ లో చైనా
- మూడింట ఒక వంతు ఉద్యోగాలను కోల్పోనున్న అమెరికా
రోబోలు, ఆటోమేషన్ వల్ల భారత్ కు తీవ్ర ప్రమాదం పొంచి ఉందా? కోట్లాది ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయా? దీనికి సమాధానంగా 'ఔను' అంటోంది ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే. 2030 నాటికి ఇండియాలో 11 నుంచి 12 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేసింది. అతి ఎక్కువ ఉద్యోగాలను చైనా కోల్పోనుందని... ఈ దేశంలో 20 కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోతారని తన నివేదికలో పొందుపరిచింది. చైనా, భారత్, అమెరికా, మెక్సికో, జపాన్ దేశాలు రోబోలు, ఆటోమేషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయని తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది నిరుద్యోగులు కానున్నారని మెకిన్సే స్పష్టం చేసింది. అమెరికాలో మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలను కోల్పోతారని అంచనా వేసింది. అభివృద్ధి చెందిన దేశాలే కాక... వర్ధమాన దేశాలు కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నాయని చెప్పింది. ఆటోమేషన్ త్వరగా విస్తరిస్తోందని... దీని ప్రభావంతో మెషీన్ ఆపరేటర్లు, బ్యాక్ ఆఫీస్ ఉద్యోగులు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు ఎక్కువగా నష్టపోతారని చెప్పింది. నైపుణ్యత కలిగిన ఉద్యోగాలు, నిర్వహణా ఉద్యోగాలపై కూడా భారీ ప్రభావం పడనుందని తెలిపింది. 46 దేశాల్లో సర్వే చేసిన మెకిన్సే... ఈ మేరకు తన నివేదికలో పొందుపరిచింది. ఉద్యోగాలను కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కూడా కష్టమవుతుందని... దీనికి తోడు విద్యను పూర్తి చేసుకున్నవారికి కూడా చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్పింది. ఇదంతా జీతాలపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపింది.