Padma Rajan: అక్షరాలా 184వ సారి.. ఎన్నికల బరిలోకి దిగుతున్న 'ఎలక్షన్' కింగ్!

  • దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా బరిలోకి
  • పీవీ, మన్మోహన్, అబ్దుల్ కలాం, కేఆర్ నారాయణన్.. ఎవరినీ వదలని వైనం
  • తాజాగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు

అతని పేరు కె. పద్మరాజన్. స్వగ్రామం తమిళనాడులోని సేలం. వృత్తిపరంగా వైద్యుడు కావడంతో పేరు ముందు డాక్టర్ వచ్చి చేరింది. 1988లో తొలిసారి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి వస్తూనే ఉంది. ఎలక్షన్ అనే పేరు వినిపిస్తే, దాంతోపాటే డాక్టర్ కె.పద్మరాజన్ పేరు కూడా కనిపిస్తుంది. దానికి కారణం ఆయన ‘ఎలక్షన్ కింగ్’ కావడమే. కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదూ.. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.

ఎన్నికల్లో పోటీ చేయడం పద్మరాజన్ హాబీ. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన అక్కడ వాలిపోతారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు దేనినీ వదలరు. ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తారు. గెలుపు గురించి  పట్టించుకోకుండా బరిలోకి దిగి ఎలక్షన్ కింగ్ అయ్యారు. ఇప్పటి వరకు 183 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తాజగా 184వ సారి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి డిసెంబరు 21న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో పద్మరాజన్ ముచ్చటగా 184వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన ఆయనను అందరూ ‘ఆల్ ఇండియా ఎలక్షన్ కింగ్’గా ముద్దుగా పిలుచుకుంటారు.

పద్మరాజన్ పోటీకి దిగే సమయంలో ప్రత్యర్థులను ఏమాత్రం పట్టించుకోరు. 1988లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్‌పై  పోటీకి నామినేషన్లు వేశారు. మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి, జయలలిత, కరుణానిధి, పీవీ నరసింహారావు లాంటి రాజకీయ ఉద్ధండులపైనా పోటీ చేశారు.

1991లో పీవీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసినప్పుడు ఆయనపై దాడి కూడా జరిగింది. అయినా ఆయన పంథా మార్చుకోలేదు. 183 సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. అలాగని పోటీ చేయడం మానలేదు. నామినేషన్ వేసిన తర్వాత పద్మరాజన్ ప్రచారానికి వెళ్లరు. రూపాయి కూడా ఖర్చు చేయరు. ప్రజాస్వామ్యాన్ని నిరూపించడమే తన లక్ష్యమని చెప్పే పద్మరాజన్ ఎన్నికల్లో ఎక్కువసార్లు  పోటీ చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్,లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు.

  • Loading...

More Telugu News