suresh raina: ధోనీ సీక్రెట్స్ గుట్టు విప్పేసిన రైనా!
- మ్యాచ్ లో ఏం చేస్తాడో ఎవరికీ అర్ధం కాదు
- ముందు రోజు రాత్రి ప్లాన్స్ సిద్ధం చేసుకుంటాడు
- ప్రతి మ్యాచ్ కి ఏ,బీ, సీ ప్లాన్స్ సిద్ధంగా ఉంటాయి
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించిన సీక్రెట్స్ ను సురేశ్ రైనా అభిమానులతో పంచుకున్నాడు. ధోనీని అంతా మిస్టర్ కూల్ గా పేర్కొంటుంటారు కానీ ధోనీ మిస్టర్ కూల్ కాదని రైనా అన్నాడు. ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ వెబ్ సిరీస్ లో ధోనీ గురించి మాట్లాడుతూ, మైదానంలో ధోనీ ఆలోచనలు అర్థం కావని అన్నాడు. మ్యాచ్ మధ్యలో ధోనీకి కోపం వస్తుందని, దానిని కనిపించనివ్వకుండా దాచేసి, ఓవర్ సమాప్తం కాగానే టీవీలో యాడ్స్ ప్రసారమయ్యే సమయంలో దానిని తమ మీద ప్రదర్శిస్తాడని అన్నాడు. దీంతో ధోనీ కోపం టీవీల్లో కనిపించదని తెలిపాడు.
ఒకసారి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా తనపై ధోనీకి పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ ఫిర్యాదు చేశాడని గుర్తు చేసుకున్నాడు. దీంతో తన దగ్గరికి వచ్చిన ధోనీ 'ఏం జరిగింది?' అని అడిగాడని, దానికి తాను 'పాక్ ఆటగాళ్ల మీద ఒత్తిడి పెంచేందుకు బంతులు విసురుతున్నా'నని సమాధానమిస్తే... 'ఇంకా ఎక్కువ బంతులు వేసి వారిపై ఒత్తిడి పెంచు' అని సలహా ఇచ్చాడని తెలిపాడు.
మ్యాచ్ ను ధోనీ చాలా బాగా అర్థం చేసుకుంటాడని, తరువాత ఏం జరుగనుందో ముందే చెప్పేస్తాడని రైనా చెప్పాడు. ధోనీ వద్ద ఎప్పుడూ మూడు గేమ్ ప్లాన్ లు సిద్ధంగా ఉంటాయని అన్నాడు. ఆ ప్లాన్ లను మ్యాచ్ ముందు రోజు రాత్రి సిద్ధం చేసుకుంటాడని వెల్లడించాడు. దానిని ఎవరికీ తెలియనివ్వడని, అవసరాన్ని బట్టి ప్లాన్ ఏ, బి, సీ ని వినియోగిస్తాడని చెప్పాడు. అందువల్లే మ్యాచ్ గురించి ఏమాత్రం టెన్షన్ పడడని తెలిపాడు. అంత సమర్థుడు కాబట్టే మిస్టర్ కూల్ పేరుకు న్యాయం చేస్తున్నాడని రైనా వెల్లడించాడు.