falaknuma palace: ఇవాంకాకు మోదీ ఇచ్చిన విందుపై.. నిజాం మనవడు నజాఫ్ అలీ ఖాన్ అసంతృప్తి
- విందుకు నన్ను, నా కుటుంబాన్ని ఆహ్వానించలేదు
- గత పది రోజులుగా అధికారులు నా సలహాలు తీసుకున్నారు
- మా సంస్కృతి, సంప్రదాయంలోనే విందు జరిగింది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు, అధికారులు, విదేశీ ప్రతినిధులకు ప్రధాని మోదీ హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలస్ లో నిన్న రాత్రి విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమంపై ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదుతో పాటు తమ కుటుంబ సంస్కృతికి ఈ ప్యాలస్ గుర్తింపు సూచకమని... అలాంటి చోట జరిగిన విందుకు తనను, తన కుటుంబాన్ని ఆహ్వానించకపోవడం దారుణమని విమర్శించారు.
ఈ విందు కార్యక్రమానికి సంబంధించి నీతి ఆయోగ్ అధికారులు గత పది రోజులుగా తనను సంప్రదించారని, ఇవాంకా కోసం నిజాం గదిని బుక్ చేశారని చెప్పారు. నిజాం పాలకుల విధానంలోనే ఇవాంకాకు స్వాగతం పలికారని, ఆహార పదార్థాలను కూడా అదే తీరులో తయారు చేశారని చెప్పారు. తమ సంస్కృతి, సంప్రదాయంలోనే విందు జరిగిందని... అయినా, తమను మాత్రం ఆహ్వానించలేదని ఆయన వాపోయారు.