madhavi lata: 'మనకు సిగ్గు లేదు..' అంటూ నేతల తీరును ప్రశ్నించిన టాలీవుడ్ ముద్దుగుమ్మ!

  • నచ్చావులే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మాధవీలత
  • జీఈఎస్ కారణంగా చోటుచేసుకున్న పరిణామాలపై మండిపాటు
  • అతిథుల కోసమేనా?.. ప్రజలకోసం చేయరా? అంటూ ప్రశ్న

'నచ్చావులే' సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకున్న తెలుగు యువతి మాధవీలత హైదరాబాదులో నేడు చోటుచేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా మాధ్యమంగా ప్రశ్నించింది.

'మన హైదరాబాద్‌ కు ఇవాంకా ట్రంప్ వస్తుండడంతో ఇంత హడావిడి. ఆమె వెళ్లే ప్రాంతాల్లో క్లీనింగ్, పెయింటింగ్ చేశారు. బాగుంది. మరి అమెరికాకు మన అధినేతలు వెళ్తే వాళ్లేమీ కొత్తగా చేయరు. ఎందుకు? అంటే వారికి మర్యాదలు చేయడం తెలియకా? లేక రాకా? కాకపోతే అలా హడావుడి చేయాల్సిన అవసరం వారికి లేదా?  అదీకాకపోతే అక్కడ ప్రజలందరికీ ఒకే తరహా రోడ్లు ఉన్నాయా? అంటే దీని అర్ధం మనం ఇంకా చాలా డెవలప్‌ మెంట్ అవ్వాల్సి ఉందని అర్థమైంది కదా! ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథి కోసం కాకుండా ప్రజల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అవెప్పుడూ అలాగే ఉండాలి' అంటూ ఆకాంక్షించింది.

 అలా చేస్తే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు హడావుడి, హంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అతిథుల వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యలకు తోడు పోలీసుల ఓవర్ యాక్షన్ ఒకటి అని మండిపడింది. ఏమంటే సెక్యూరిటీ రీజన్స్ అంటారని చిరాకు పడింది. మన దేశంలో వీఐపీల ప్రాణాలకు తప్ప మామూలు మనుషుల ప్రాణాలకు విలువ లేదా? అని ఆమె ప్రశ్నించింది. వీఐపీలు వచ్చి మనకు ఏం ప్రాజెక్టులు తెస్తారో? తీసుకురారో? తెలీదు కానీ సాధారణ ప్రజానీకం మాత్రం కష్టాల పాలు కావాల్సిందేనని పేర్కొంది.

అయినా మనకు సిగ్గురాదని ఆవేదన వ్యక్తం చేసింది. అదే నాయకులకు ఓట్లు వేస్తాం, ఎందుకంటే, ఎవరో ఒకరు వస్తున్నారనైనా రోడ్లు వేశారు కదా అన్న ఆనందంతో పొంగిపోతామని తెలిపింది. ఏంటో ఈ ఖర్మ? అంటూ నిట్టూర్చింది. తన పోస్టు ఎవరికి నచ్చినా నచ్చుకున్నా... ప్రభుత్వ విధానాలు నచ్చలేదని సూటిగా చెప్పింది. 

  • Loading...

More Telugu News