Narendra Modi: నేను ప్రధానమంత్రిని అయినందుకు ఓర్వలేకపోతున్నారు: నరేంద్ర మోదీ భావోద్వేగం
- మోదీపై కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం అభ్యంతరకర పోస్ట్
- గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగం
- కాంగ్రెస్ పేదలకు వ్యతిరేకం.. గుజరాతీ బిడ్డను అవమానిస్తున్నారు
- నేను టీ అమ్మాను.. దేశాన్ని అమ్మలేదు
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం 'యువ దేశ్' ప్రధాని మోదీపై ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్రిటన్ 'ప్రధాని థెరిసా మే'ని నరేంద్ర మోదీ.. 'మీమీ' అని పిలుస్తున్నట్లు, దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరిచేస్తూ, 'మీ మీ కాదు, మే మే' అని పలకాలని చెబుతున్నట్లు ఉంది.
తాజాగా రాజ్‌కోట్ బహిరంగ సభలో ఈ విషయంపై స్పందించిన ప్రధాని మోదీ తాను చాయ్ అమ్ముకున్నాను కానీ, దేశాన్ని అమ్ముకోలేదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ పేదలకు వ్యతిరేకమని, ఆ పార్టీ నేతలు నిరంతరం తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తక్కువచేసి మాట్లాడతారని అన్నారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందని వ్యాఖ్యానించారు.
తాను చాయ్ అమ్మిన మాట వాస్తవమేనని మోదీ ఉద్ఘాటించారు. రాజకీయ లబ్ధి కోసం గత రెండు నెలలుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ప్రజా జీవితంలో ఎటువంటి మచ్చలేని ఓ గుజరాతీ బిడ్డను కాంగ్రెస్ అవమానిస్తోందని అన్నారు. గుజరాతీలు తమ ఓటుతో కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.