mosquitoes: దోమలు కనిపిస్తే చంపేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఎన్నింటిని చంపామో లెక్కిస్తున్న వైనం!
- విందు నాటికి దోమలను పూర్తిగా నిర్మూలించేందుకు జీహెచ్ఎంసీ కృషి
- ఐదు రోజుల క్రితం కోటలో గంటకు 200 దోమలు
- ప్రస్తుతం 40 దోమలు
- నేటితో ఒక్క దోమ కూడా లేకుండా చేస్తామన్న అధికారులు
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ఏమో గానీ హైదరాబాద్‌లో మాత్రం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, శ్వేతసౌధ సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ఈ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో భాగ్యనగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఆమె పుణ్యమా అని రోడ్లు వేస్తున్నందుకు ప్రజలు సంతోషిస్తున్నారు. అలాగే ఆమె పర్యటించే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
తాజాగా జీఈఎస్‌కు హాజరయ్యే అతిథులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తల విందుకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విందు ఇచ్చే నాటికి కోటలో ఒక్క దోమ కూడా ఉండకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల పద్ధతులను ఉపయోగిస్తూ దోమలను చంపేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేపడుతుండడంతోపాటు అల్ఫా సైపర్ మెథ్రిన్ వాడుతున్నారు. అలాగే సువాసనలు వెదజల్లేందుకు సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్ లిక్విడ్లను స్ప్రే చేస్తున్నారు. ఇందుకోసం నాలుగు డ్యూరోటెక్ మెషీన్లు, 8 పవర్ స్ప్రేయర్లు, 8 మొబైల్ మెషీన్లు ఉపయోగిస్తున్నారు.
చంపుతున్న దోమలను మస్కిటో డెన్సిటీ అధ్యయనం చేస్తున్నారు. సక్షన్ ట్యూబ్‌ల ద్వారా గోడలపై ఉన్న దోమలను ఓ ట్యూబ్‌లోకి పంపించి లెక్కిస్తున్నారు. రోజూ రెండుసార్లు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల క్రితం కోటలో గంటకు రెండు వందల దోమలు ఉండగా శనివారం నాటికి 40కి తగ్గినట్టు ఈ పరీక్షల్లో తేలింది. ఈరోజుతో వాటిని పూర్తిగా నిర్మూలించాలని అధికారులు కంకణం కట్టుకున్నారు.