dalailama: చైనా పట్ల ప్రేమ కురిపించిన దలైలామా... తాము ఆ దేశంతోనే ఉండాలనుకుంటున్నట్టు ప్రకటన!
- టిబెట్ కు స్వాతంత్ర్యం అక్కర్లేదు
- టిబెట్ ను గొప్పగా అభివృద్ధి చేయాలి
- మాతృ దేశాన్ని ప్రేమిస్తున్నామని ప్రకటన
టిబెట్ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ మత గురువు దలైలామా చైనా పట్ల తన అభిప్రాయాలను సుస్పష్టం చేశారు. టిబెట్ చైనా నుంచి స్వాతంత్ర్యం కోరుకోవడం లేదని, కానీ టిబెట్ ను గొప్పగా అభివృద్ధి చేయాలని మాత్రం ఆశిస్తున్నట్టు దలైలామా తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
‘‘మేము స్వాతంత్ర్యం కోరుకోవడం లేదు. చైనాలో ఉండాలనుకుంటున్నాం. కానీ, మాకు మరింత అభివృద్ధి కావాలి. టిబెట్ కు భిన్నమైన సంస్కృతి ఉంది. విభిన్నమైన స్క్రిప్ట్ ఉంది. చైనీయులు తమ దేశాన్ని ప్రేమిస్తారు. మేం మా మాతృదేశాన్ని ప్రేమిస్తాం’’ అని ప్రకటించారు. యాంగ్జే నుంచి సింధు నది వరకు ప్రధాన నదులన్నీ కూడా టిబెట్ నుంచే ప్రవహిస్తాయని, కోట్లాది మందికి ఇవి జీవనాధారం అని, వీటిని పరిరక్షించడం టిబెట్ తో పాటు ప్రజలకీ మంచిదన్నారు. భారత్ లో మతసహనం స్ఫూర్తిని కొనియాడారు. కొన్ని సార్లు రాజకీయ నేతలు దీన్ని చెడగొట్టాలని చూడడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు.