Airtel: రూ. 7 వేల కోట్ల విరాళం ప్రకటించిన ‘ఎయిర్‌టెల్’ కుటుంబం!
- తమ మొత్తం ఆదాయంలో పది శాతాన్ని విరాళంగా ప్రకటించిన సునీల్ మిట్టల్
- యూనివర్సిటీ ఏర్పాటు చేసి పేదలకు ఉచిత విద్య
- 2021 నుంచి అందుబాటులోకి సత్యభారతి యూనివర్సిటీ
దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ భారీ విరాళాన్ని ప్రకటించారు. తమ వ్యక్తిగత సంపదలో పదిశాతాన్ని అంటే రూ. 7 వేల కోట్లను గ్రూప్ దాతృత్వ సంస్థ అయిన భారతి ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ మొత్తంలోనే ఎయిర్‌టెల్‌లో భారతి కుటుంబానికి చెందిన మూడు శాతం వాటా కూడా ఉంది.
విరాళంగా ప్రకటించిన సొమ్ముతో సత్యభారతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి పేదలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన యువ ప్రతిభావంతులకు ఉచిత విద్య అందించనున్నట్టు చెప్పారు. ఈ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ.. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. ఉత్తర భారతదేశంలో అందుబాటులోకి రానున్న ఈ యూనివర్సిటీ 2021 నాటికి రెడీ అవుతుంది. పదివేల మందితో అదే ఏడాది తొలి అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుందని సునీల్ మిట్టల్ వివరించారు.
సత్యభారతి యూనివర్సిటీ ఏర్పాటుకు తొలి దశలో రూ.1000 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పిన మిట్టల్ పేద విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. సీట్లు మిగిలితే నామమాత్రపు రుసుముతో ఇంకొందరిని తీసుకుంటామన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి కోసం పంజాబ్, హరియాణా సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు మిట్టల్ తెలిపారు.