giddi eswari: వైసీపీలో ముసలం: పొమ్మనకుండా పొగపెడుతున్నారా? అంటూ విజయసాయిని నిలదీసిన గిడ్డి ఈశ్వరి!
- అరకు టికెట్ రవిబాబుకే అంటూ ప్రకటన
- మండిపడ్డ గిడ్డి ఈశ్వరి
- టీడీపీలోకి వెళ్లిన వ్యక్తికి మళ్లీ టికెట్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం
వైసీపీలో ముసలం పుట్టింది. అరకు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలతో విశాఖపట్నం జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి షాక్ కు గురయ్యారు. అంతేకాదు, జరిగిన విషయంపై పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డిని నిలదీశారు. వివరాల్లోకి వెళ్తే, పాడేరుకు పొరుగు నియోజకవర్గమైన అరకులో పార్టీ సమావేశాన్ని పెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, అరకు అసెంబ్లీ టికెట్ ను రవిబాబుకు ఇస్తామంటూ ప్రకటించడంపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా విజయసాయితో ఆమె మాట్లాడుతూ, "ఏంటి సార్, పొమ్మనలేక పొగ పెడుతున్నారా?" అంటూ ముఖంమీదే అడిగేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా అరకులో సమావేశం ఎలా పెడతారని ప్రశ్నించారు. జగనే సర్వస్వం అనుకుని పనిచేస్తున్నానని... తనతో మాట మాత్రమైనా చెప్పకుండానే రవిబాబు పేరును ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. జగన్ ఇచ్చిన భరోసాతో బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకుని పార్టీ కోసం పని చేస్తున్న సమన్వయకర్త శెట్టి ఫాల్గుణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సొంత పార్టీకి చెందిన కొంత మంది నేతలు తమను బాగా ఇబ్బంది పెడుతున్నారని కంటతడి పెట్టారు. అరకు టికెట్ ను శెట్టి ఫాల్గుణకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరిన రవిబాబు తిరిగి వైసీపీలో చేరేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 19వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొందరు వైసీపీ నేతలను ఆహ్వానించారు. ఈ సమావేశంలో వైసీపీ టికెట్ రవిబాబుకే అంటూ ప్రకటించారు. దీంతో, జగన్ ను తీవ్రంగా విమర్శించి టీడీపీలోకి వెళ్లిన రవిబాబుకు మళ్లీ టికెట్ ఇస్తామని ఎలా ప్రకటిస్తారని గిడ్డి ఈశ్వరి మండిపడుతున్నారు.
ఈ క్రమంలో, విశాఖకు విజయసాయిరెడ్డి వస్తున్నారని తెలుసుకున్న ఈశ్వరి, నేరుగా తన అనుచరులతో కలసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చాంబర్ లో ఉన్న విజయసాయి వద్దకు వెళ్లి, తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కోసం కేసులను సైతం ఎదుర్కొంటున్న వారికి కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీలాంటి వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని విజయసాయి చెప్పారట. అయితే, రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా మారనున్నాయో అనే ఆందోళన స్థానిక వైసీపీ నేతల్లో నెలకొంది.