komatireddy venkat reddy: కొత్త పార్టీ పెట్టే యోచనలో కోమటిరెడ్డి బ్రదర్స్? రామోజీరావును కలసి సహకారం కోరిన వెంకటరెడ్డి!
- కాంగ్రెస్ హైకమాండ్ తీరు పట్ల గుర్రు
- రామోజీని కలసి సలహాలు తీసుకున్న కోమటిరెడ్డి
- 2019లో చక్రం తిప్పాలనేదే వ్యూహం
తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల హవానే వేరు. ఒకవైపు కీలకమైన నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం, మరోవైపు బలమైన రెడ్డి సామాజికవర్గం, దీనికి తోడు ఎంతైనా ఖర్చు చేయగలిగే ఆర్థిక స్థితి వీరిది. గత కొంత కాలంగా వీరు కాంగ్రెస్ హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొనగలిగే సామర్థ్యం ఉన్న తమను కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని వీరు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కాగలిగిన స్థాయి ఉన్న తమను కాదని ఉత్తమ్ కు పట్టం కట్టడాన్ని వీరు జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, పార్టీ కూడా రేవంత్ కు తగిన గుర్తింపును ఇవ్వాలనే యోచనలో ఉండటం కూడా వీరికి నచ్చలేదు.
ఈ నేపథ్యంలో, వీరి అడుగులు కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా పడుతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న రామోజీ గ్రూపు అధినేత రామోజీరావును కలిశారు. దాదాపు అరగంట సేపు ఆయనతో చర్చలు జరిపారు. తమకు మీ ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా రామోజీని కోమటిరెడ్డి కోరారట. కాంగ్రెస్ లో కొనసాగాలా? వద్దా? అనే సలహాను కూడా రామోజీ నుంచి తీసుకున్నారట. తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సూచనలను కోరారట. ఈ విషయం ఇప్పుడు టీకాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెడితే, ఒకవేళ 2019లో తెలంగాణలో హంగ్ వస్తే, తాము చక్రం తిప్పవచ్చనే ఆలోచనలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారట. మరి ఏం జరగనుందో తెలవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.