polavaram: పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో చంద్రబాబు ప్రకటన!
- వాయిదాలు వేయకుండా పూర్తి చేసి ఉంటే రూ.129 కోట్లతో పూర్తయ్యేది
- సవరించిన అంచనాల ప్రకారం రూ.58 వేల కోట్లు అయింది
- ఇప్పటివరకు రూ.12,567.22 కోట్ల పనులు పూర్తయ్యాయి
- ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4329 కోట్లు వచ్చాయి
పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైందని నొక్కిచెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇది పెద్ద ప్రాజెక్టని, దీనిపై చాలా శ్రద్ధ పెట్టామని చెప్పారు. తాను ఇప్పటివరకు 20 సార్లు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లానని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎంతో లాభం కలుగుతుందని తెలిపారు.
ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపడం వల్ల అడ్డంకి తొలగిందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నారని చెప్పారు. తాను ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నానని తెలిపారు. వాయిదాలు వేయకుండా పూర్తి చేసి ఉంటే రూ.129 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. సవరించిన అంచనాల ప్రకారం రూ.58 వేల కోట్లు అవుతోందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.12,567.22 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4329 కోట్లు వచ్చాయని వివరించారు. రేడియల్ గేట్లు వంద శాతం పూర్తయ్యాయని చెప్పారు.
కాగా, 1941లో పోలవరం ప్రాజక్టు ప్రతిపాదన వచ్చిన సమయంలో 6 కోట్ల 70 లక్షల రూపాయలు ప్రాజక్టు వ్యయంగా అప్పట్లో అంచనా వేయడం జరిగింది. అదే ఆ తర్వాత 1946-47లో మార్చిన డిజైన్ ప్రకారం ఈ అంచనా వ్యయం 129 కోట్లకు చేరింది. అది అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఇన్ని వేల కోట్లకు చేరింది.