kim jung un: మరో తుగ్లక్ లా మారిన కిమ్ జాంగ్ ఉన్.. ప్రజలపై మరిన్ని ఆంక్షలు
- ఉత్తరకొరియా ప్రజలపై ఆంక్షలు విధించిన కిమ్ జాంగ్ ఉన్
- వినోదకార్యక్రమాలు చూడకూడదు
- గుంపులుగా ఉండకూడదని ఆదేశం
అణ్వాయుధ పరీక్షలతో కంగారు పుట్టిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశ ప్రజల పాలిట పిచ్చి తుగ్లక్ లా మారినట్టు దక్షిణకొరియా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఆర్థిక ఆంక్షల బారిన పడిన ఉత్తరకొరియా.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా, మరిన్ని అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో తన ప్రజలపై అధ్యక్షుడు కిమ్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారని దక్షిణకొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరకొరియా ప్రజలు వినోదాత్మక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారని ఆ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రజలు సమూహంగా ఏర్పడడాన్ని కూడా నిషేధించారు. మద్యం సేవించడం, పాటలు పాడడంపై కూడా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఈ నిషేధాజ్ఞలతో ప్రజలపై పట్టు సాధించడమే కాకుండా ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కునేందుకు కూడా దోహదపడతాయని కిమ్ భావిస్తున్నారని దక్షిణకొరియా నిఘా సంస్థ వెల్లడించింది.