rabert mugabe: జింబాబ్వేలో ముగిసిన ముగాబే 37 ఏళ్ల సుదీర్ఘ పాలన!
- 1980 నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా కొనసాగిన రాబర్ట్ ముగాబే
- చిన్న భార్యను వారసురాలిగా ప్రకటించే ప్రణాళిక
- సైన్యం ఒత్తిడితో చివరికి రాజీనామా
37 ఏళ్ల సుదీర్ఘకాలం జింబాబ్వేకు అధ్యక్షుడిగా సేవలందించిన రాబర్ట్ ముగాబే తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముదెండా ధ్రువీకరించారు. 1980లో ముగాబే జింబాబ్వే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి దేశాన్ని నిరాఘాటంగా పాలిస్తూ వస్తున్నారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో తన చిన్న భార్య గ్రేస్ ను వారసురాలిగా ప్రకటించే క్రమంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమర్సన్ ను తొలగించారు. దీంతో వివాదం ముదిరింది.
ఈ క్రమంలో చైనా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ఆర్మీ చీఫ్ కాన్ స్టాంటినో చివెంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అధ్యక్షుడు ముగాబేను హౌస్ అరెస్టు చేశారు. అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేయాలని, లేని పక్షంలో పార్లమెంటు అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో జింబాబ్వే రాజధాని హరారే వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది.