ivanka trump: ఇవాంకా రాక నేపథ్యంలో.. భారత పోలీసుల వద్ద తుపాకులే వుండకూడదంటూ అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆదేశాలు!
- వచ్చే వారంలో హైదరాబాద్ రానున్న ట్రంప్ కుమార్తె
- గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు హాజరు
- ప్రధాని మోదీతో కలసి పాల్గొననున్న ఇవాంకా
- యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారుల ఆంక్షలు
వచ్చే వారంలో హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరు కానుండగా, ఆమె భద్రతకు సంబంధించి అమెరికా సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది. ఆమెకు భద్రతగా ఉండే ఇండియన్ పోలీసులు ఎవరి వద్దా ఆయుధాలు ఉండరాదని సూచించింది. విధులు నిర్వర్తించే పోలీసులు యూనిఫాంలో ఉండకూడదని, అందరూ సివిల్ దుస్తుల్లోనే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు.
ఇప్పటికే ట్రంప్ భద్రతా వ్యవహారాలను చూసే సీక్రెట్ సర్వీస్ అధికారులు హైదరాబాద్ చేరుకుని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర విభాగాలతో ఇవాంక భద్రతపై సమీక్ష జరిపారు. ఇప్పటికే కనీవినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేయగా, రోజుకో కొత్త నిబంధనను యూఎస్ సీక్రెట్ సర్వీస్ తెరపైకి తెస్తుండటం అధికారులను ఇరుకున పెడుతోందని సమాచారం.
హెచ్ఐసీసీలో జరిగే కార్యక్రమంలో ఇవాంకా పాల్గొననుండగా, అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు ఎవరి వద్దా ఆయుధాలు, వద్దని, అందరూ సివిల్ డ్రస్సులో ఉండాలని యూఎస్సీఎస్ చెబుతోంది. దీనిపై ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నామని, మొత్తం 2 వేల మంది పోలీసులను భద్రతకు వినియోగిస్తామని వెల్లడించారు.