శబరిమల: శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ఓ మహిళ విఫలయత్నం!
- పదినెంట్టాంపడిని ఎక్కుతుండగా అడ్డుకున్న పోలీసులు
- ఏపీకి చెందిన మహిళగా గుర్తింపు
- డిప్యూటీ కమిషనర్ సతీష్ బినో వెల్లడి
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల గుడిలోకి వెళ్లేందుకు ఓ మహిళ విఫలయత్నం చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సతీష్ బినో మాట్లాడుతూ, పదినెంట్టాంపడిని ఎక్కుతుండగా ఓ మహిళను అడ్డుకున్నామని, ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ప్రకారం ఆ మహిళకు 31 సంవత్సరాలని, నిర్ధారణకు వచ్చామని చెప్పారు.
10 నుంచి 50 ఏళ్ల వయసున్న స్త్రీలెవరికీ ఆలయంలోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు. ఏపీకి చెందిన ఆ మహిళ తన కుటుంబసభ్యులతో వచ్చినట్టు గుర్తించారని, సాధారణంగా శబరిమలకు వచ్చే మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి, అనంతరం, కొండపైకి అనుమతిస్తామని చెప్పారు. అసలు, ఆ మహిళ పదునెట్టాంపడి వరకూ ఎలా వచ్చిందో అర్థం కాలేదని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయం ముందున్న పదునెట్టాంపడిని ఎక్కేందుకు సదరు మహిళ యత్నించగా ఆమెను అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు.