Operation: వైద్యశాస్త్రంలోనే అద్భుతం... తలలు మార్చేసిన ఇటలీ వైద్యుడు!
- ఆస్ట్రియాలోని వియన్నాలో శస్త్రచికిత్స
- శవం తల నుంచి వేరైన మొండేనికి మరో శవం తలను అతికించిన వైద్యులు
- ఫలించిన వైద్య నిపుణుల 18 గంటల శ్రమ
- తదుపరి లక్ష్యం జీవించి వున్న వారి తలలను మార్చడమే!
వైద్యశాస్త్రంలో మరో ముందడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా వైద్యులకు సవాలుగా నిలిచిన తల మార్పిడిని ఆస్ట్రియాలోని వియన్నాలో ఇటలీకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ సెర్గియా కానోవేరో నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సుమారు 18 గంటల పాటు నిర్వహించిన సర్జరీ ద్వారా ఒక శవం తలను మరో శవానికి అమర్చినట్టు కానోవేరో ప్రకటించారు. ఇది విజయవంతం అయిందని ప్రకటించిన ఆయన అందుకు సాక్ష్యాలను మాత్రం చూపించలేదు.
గత ఏడాది ఆయన మాట్లాడుతూ, వచ్చేఏడాది తలను మార్చే శస్త్రచికిత్స చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలో అది సాధ్యమా? అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స నిర్వహించిన ఆయన, సొంత టెక్నిక్ తో వెన్నెముక, నరాలు, రక్తనాళాలతో తలను అనుసంధానించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిని ప్రకటించారు. అయితే ఈ ఆపరేషన్ టెక్నిక్ ఏమిటన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. తాజా శస్త్రచికిత్సతో జీవించి ఉన్న మనుషుల తలలను మార్చే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. త్వరలో ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు.