kerala: 516 కి.మీ.లు ఏడు గంటల్లో.. నెలరోజుల పాపను కాపాడటానికి సాహసం చేసిన కేరళ అంబులెన్స్ డ్రైవర్
- సాధారణంగా దాదాపు 13 గంటలు పట్టే ప్రయాణం
- గంటకు 76 కి.మీ.ల సరాసరి వేగంతో నడిపిన డ్రైవర్
- ట్రాఫిక్ క్లియర్ చేయడంలో సహకరించిన పోలీసులు
31 రోజుల వయసున్న పాపకు హార్ట్ సర్జరీ చేయించడం కోసం కేరళలోని కన్నూర్ నుంచి రాజధాని తిరువనంతపురం వరకు ఉన్న 516 కి.మీ.ల దూరాన్ని కేవలం 7 గంటల్లో చేరుకునేలా తమీమ్ అనే డ్రైవర్ అంబులెన్స్‌ను నడిపాడు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం చూస్తే ఈ దూరాన్ని దాటడానికి దాదాపు 13 గంటలు పడుతుంది. మధ్యలో ఆగిన 15 నిమిషాల విరామాన్ని వదిలేస్తే తిరువనంతపురానికి తమీమ్ 6 గం.45 ని.ల్లో చేరుకున్నాడు. గంటకు 76 కి.మీ.ల సరాసరి వేగంతో తమీమ్ అంబులెన్స్‌ను నడిపినట్లు తెలుస్తోంది.
ముందు పాప ఫాతిమా లాబియాను విమానం ద్వారా పంపించాలని కన్నూర్‌లోని పరియారం మెడికల్ కాలేజీ, ఆసుపత్రి యాజమాన్యం అనుకున్నాయి. కానీ విమాన అంబులెన్స్ సిద్ధం చేయడానికే చాలా సమయం పడుతుందని తెలిసి రోడ్డుమార్గాన పంపించాలని నిశ్చయించుకున్నాయి. అయితే ఈ ప్రయాణంలో కేరళ పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ కేరళ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రోడ్డు మీద ట్రాఫిక్ క్లియర్ చేసి, మార్గాన్ని సుగమం చేయడంలో సహాయపడ్డారు. సరైన సమయానికి తిరువనంతపురంలోని శ్రీ చిత్ర మిషన్ ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.