robert mugabe: సైన్యం గుప్పిట్లోకి వెళుతున్న జింబాబ్వే.. రాజీనామా చేయాలంటూ ముగాబేపై ఒత్తిడి
- ఆర్మీ నిర్బంధంలో రాబర్ట్ ముగాబే
- రాజీనామా చేయనని చెప్పిన ముగాబే
- మరికొంత సమయం ఇస్తామన్న ఆర్మీ
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆ దేశ సైన్యం హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయనను కొందరు సైనికాధికారులు కలిశారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ఆయనను కోరారు. అయితే, అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ముగాబే తిరస్కరించారు. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సైనికాధికారి ఈ విషయాలను వెల్లడించారు. ముగాబేను తాము కలిశామని, పదవి నుంచి తప్పుకోవాలని కోరామని ఆయన తెలిపారు. అయితే, పదవికి రాజీనామా చేయడానికి ఆయన నిరాకరించారని చెప్పారు. రాజీనామా చేయడానికి ఆయనకు మరికొంత సమయం ఇస్తామని తెలిపారు.
తన భార్య గ్రేస్ ను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు ముగాబే ప్రయత్నిస్తున్నారు. ఈయన నిర్ణయాన్ని మాజీ ప్రధాని సవంగిరాయ్ తో పాటు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. జింబాబ్వే ఆర్మీ చీఫ్ కూడా ముగాబే పదవి నుంచి తప్పుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ ఆయనను హౌస్ అరెస్ట్ చేసింది. మరోవైపు, జింబాబ్వేలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆఫ్రికన్ డెవలప్ మెంట్ కమ్యూనిటీ ప్రయత్నిస్తోంది.