telangana: "గురుతర గద్య పద్యోక్తుల కన్న సరసమైన తెలుగు..." కేసీఆర్ నోట 'గాథా సప్తశతి' పద ప్రయోగాలు!
- త్వరలో ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్
- అసెంబ్లీలో ప్రకటన చేసిన కేసీఆర్
- తెలుగు వైభవాన్ని వివరిస్తూ సాగిన ప్రసంగం
- సభలకు సహకరించాలని విపక్షాలకు వినతి
అతి త్వరలో ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండటాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తూ, మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాష ప్రాభవాన్ని ఆయన వివరిస్తూ, హాలుడు రచించిన 'గాథా సప్తశతి'లోని పద ప్రయోగాలను అనర్గళంగా వివరించారు.
"తెలంగాణలో పరిఢవిల్లిన సాహితీ వైభవాన్ని చాటి చెప్పాలన్న ఆశయంతో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం ఉన్న భాషగా తెలుగు భాష కీర్తి పొందింది. నికోలస్ కోర్టీ అనే పాశ్చాత్య పండితుడు తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా కొనియాడారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి, తెలుగును 'సుందర తెలుంగు' అని కీర్తించినాడు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం. చరిత్రకు అందినంతవరకూ తెలంగాణలో 2 వేల సంవత్సరాలకు పూర్వమే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి" అని ఆయన అన్నారు.
ఆపై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన హాలుని 'గాథా సప్తశతి'లో మన తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కురుక్యాల వద్ద బొమ్మల గుట్టపై ఉన్న చిన్న మల్లకుని శాసనం, కంద పద్యాలలో ఉండటం విశేషం. దీనిని బట్టి క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటికే తెలంగాణలో చందోబద్ద సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెబుతోంది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ చందస్సులకు తెలంగాణనే జన్మభూమి.
గురుతర గద్య పద్యోక్తుల కన్న సరసమైన తెలుగు మనది. అచ్చతెలుగు పలుకుబడికి పట్టంగట్టిన పాల్కురికి సోమ నాథుడు, మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి. తెలుగులో అనేక సాహితీ ప్రక్రియలకు తెలంగాణనే ఆది. తొలి స్వతంత్ర రచన బసవ పురాణం, తెలుగులో తొలి శతకం వృషాధిప శతకము, పాల్కురికి సోమన రచించిన కావ్యరత్నాలు. తొలిగా సోమన చేసిన సాహిత్య ప్రయోగాలే తరువాతి కాలానికి తెలుగు భాషకు ప్రామాణికాలు" అంటూ కేసీఆర్ తెలుగు భాషా వైశిష్ట్యాన్ని సభముందుంచారు. గాథా సప్తశతి సహా పలు కావ్యాల్లోని పద ప్రయోగాలను గుర్తు చేశారు. ఈ సభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.