శ్రీలంక-భారత్: నేటి నుంచి శ్రీలంక-భారత్ తొలి టెస్టు మ్యాచ్!
- భారత్ - శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్
- భారత్ పై టెస్టు మ్యాచ్ ల్లో లంకజట్టు ఒక్కసారీ గెలవలేదు
మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్-శ్రీలంక తొలి టెస్టు నేడు ప్రారంభం అవుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఉదయం 9 గంటలకు తొలిటెస్టు మ్యాచ్ మొదలవుతుంది. ఇటీవలే లంక పర్యటనలో భారత్ అన్ని ఫార్మాట్లలో ఆ జట్టును ఓడించిన విషయం తెలిసిందే.
శ్రీలంక చివరిసారి ఎనిమిదేళ్ల కిందట భారత్ లో టెస్టు సిరీస్ ఆడింది. గత 35 ఏళ్లలో భారత్ లో 17 టెస్టులు ఆడిన లంకజట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. దీంతో, ఈ టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుని తొలి విజయం సాధించాలని లంక జట్టు చూస్తోంది. అయితే, భారత్ లో టెస్టులు ఆడిన అనుభవం లంక జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు మాథ్యూస్, హెరాత్ కు మాత్రమే ఉండటం గమనార్హం. సొంతగడ్డపై భారత్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.