nandi: ముచ్చటగా మూడు నంది అవార్డులు ... వరుసగా గెల్చుకున్న చిన్మయి
- 2014లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది
- 2015, 2016లో గాయనిగా నంది అవార్డులు
- ఉబ్బితబ్బిబ్బైన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్
'ఏమాయ చేసావే' సినిమాతో అభిమానుల మనసులు గెల్చుకుంది కేవలం సమంత మాత్రమే కాదు... ఆమెకు గాత్రదానం చేసిన చిన్మయి శ్రీపాద కూడా! ఒక పక్క గాయనిగా, మరో పక్క డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్న చిన్మయి... నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మూడేళ్ల నంది అవార్డుల్లో ఏకంగా మూడు నందులు గెల్చుకున్నారు. గానంలో, డబ్బింగ్లో అసమాన ప్రతిభ కనబరిచి వరుసగా 2014, 2015, 2016 సంవత్సరాల్లో నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
'మనం' చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పినందుకు గాను 2014 ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ నంది, 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రంలో 'గతమా... గతమా' పాటకు గాను 2015 ఉత్తమ గాయనిగా, 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో 'మనసంతా... మేఘమై' పాటకు గాను 2016 ఉత్తమ గాయని నంది అవార్డులను ఆమె గెలుపొందారు. ఈ విషయంపై తన ఆనందాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు.
తాను మూడు నంది అవార్డులు గెల్చుకున్నానని తెలిసి ఉబ్బితబ్బిబ్బైనట్లు చిన్మయి వెల్లడించారు. ఈ ఏడాది తెలుగుతో పాటు మలయాళం, మరాఠి చిత్రాల్లోనూ తాను పాడిన పాటలకు అవార్డులు గెల్చుకున్న సంగతిని గుర్తుచేశారు. ఒక ట్వీట్లో సమంతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.