manohar parrikar: 'అడల్ట్' సినిమాకి వెళ్లి ఇంటర్వెల్ లో పక్కింటి వ్యక్తిని చూసి షాక్ తిన్నాను: గోవా ముఖ్యమంత్రి ఆసక్తికర ఫ్లాష్ బ్యాక్

  • నా సోదరుడితో కలిసి అడల్ట్ సినిమాకి వెళ్లాను
  • ఇంటర్వెల్ లో పక్కసీట్లో పక్కింటి వ్యక్తిని చూసి గుండె ఆగినంతపనైంది
  • అప్పుడే లేచి ఇద్దరం బయటకు వచ్చేసి, అమ్మకి తెలివిగా చెప్పాం
  • మరుసటి రోజు ఆయన ఫిర్యాదు చేయగానే అమ్మ మండిపడింది

కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన గురించి విద్యార్థులతో ముచ్చటించి ఆసక్తి నింపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న పారికర్, విద్యార్థులతో సరదాగా కాసేపు మాట్లాడారు.

ఆ సందర్భంగా ఒక విద్యార్థి...యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సినిమాలను చూసేవారు? అని ప్రశ్నించాడు. దానికి ఆయన సమాధానమిస్తూ, యుక్తవయసులో ఉండగా తాము మాములు సినిమాలతో పాటు అడల్ట్ సినిమాలు కూడా చూసేవారమని అన్నారు. అయితే అప్పట్లో తాము ధియేటర్లకు వెళ్లి చూసిన అడల్ట్ సినిమాల కంటే, ఇప్పుడు ఇంట్లో కూర్చునే మీరు ఎక్కువగా అలాంటివి చూస్తున్నారని ఆయన చమత్కరించారు.

ఒకసారి అడల్ట్ సినిమాకు వెళ్లిన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన వారితో పంచుకున్నారు. "ఓసారి నా సోదరుడితో కలిసి అడల్ట్ సినిమాకు వెళ్లాను. సినిమా ఇంటర్వెల్ సమయంలో లైట్స్‌ వేయగానే పక్కనే మా పక్కింటి వ్యక్తి కూర్చున్నాడు. షాక్ తిన్నట్టైంది. అతను రోజూ మా అమ్మతో మాట్లాడతాడు. మేమొచ్చినట్టు రేపు అమ్మకి చెప్పేస్తాడని అనుకునేసరికి గుండె ఆగినంతపనైంది. దీంతో మారు మాట్లాడకుండా లేచి ఇద్దరం బయటకు వచ్చేశాం. అతను ఇంట్లో చెబితే ఏం చేయ్యాలా? అని ఆలోచించాను.

 అంతే నేరుగా ఇంటికెళ్లి... అమ్మతో సినిమాకి వెళ్లామని చెప్పేశాం. అయితే అది అభ్యంతరకరమైన సినిమా కావడంతో మధ్యలోనే వచ్చేశామని చెప్పాం. మా అమ్మ ఏమీ అనలేదు సరికదా మంచి పని చేశారని చెప్పింది. మరుసటి రోజు మేము ఊహించినట్టే ఆయన వచ్చి ఫలానా సినిమాకి మీ పిల్లలువచ్చారు అని ఫిర్యాదు చేశారు. అంతే చిర్రెత్తుకొచ్చిన మా అమ్మ... నా పిల్లలు ఏ సినిమాకి వెళ్లారో నాకు తెలుసు...అలాంటి సినిమాకి నువ్వెందుకు వెళ్లావు? అని నిలదీసింది, దీంతో ఆయన మారుమాటాడకుండా వెళ్లిపోయాడ"ని ఆయన గుర్తు చేసుకున్నారు. దీంతో విద్యార్థులంతా నవ్వేశారు. 

manohar parrikar
goa cm
flash back
experience
  • Loading...

More Telugu News