robert mugabe: అట్టుడుకుతున్న జింబాబ్వే... ఆర్మీ అదుపులో అధ్యక్షుడు ముగాబే!
- ముగాబే నివాసం వద్ద గన్ ఫైరింగ్
- సైన్యం అదుపులో అధ్యక్షుడు
- ముగాబే వయసు 93 ఏళ్లు
ఆఫ్రికా దేశం జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేపై సైనిక చర్య జరిగింది. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో, జింబాబ్వే ఆర్మీ స్పందించింది. అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాన్ని తాము చేయలేదని... సైనిక తిరుగుబాటు జరగలేదని జింబాబ్వే ఆర్మీకి చెందిన మేజన్ జనరల్ సిబుసిసో మోయో తెలిపారు. దేశాధ్యక్షుడు ముగాబే క్షేమంగానే ఉన్నారని ఆయన వెల్లడించారు.
93 ఏళ్ల ముగాబేకు, ఆర్మీ చీఫ్ జనరల్ కాన్స్టాంటినో చివెంగాకు ఇటీవలి కాలంలో అగాధం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ముగాబేకు వ్యతిరేకంగా ఆర్మీ కుట్రలకు పాల్పడుతోందంటూ అధికార పార్టీకి చెందిన నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సిబుసిసో జింబాబ్వే జాతీయ టీవీలో మాట్లాడుతూ, ఈ ఆరోపణలకు కొట్టివేశారు.
ముగాబే, అతని కుటుంబసభ్యులు క్షేమంగానే ఉన్నారని... వారి భద్రతకు సంబంధించి ఆర్మీ గ్యారంటీ ఇస్తోందని సిబుసిసో అన్నారు. సైన్యం చేసింది ప్రభుత్వాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం కాదని చెప్పారు. ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్ ను మాత్రమే ఆర్మీ టార్గెట్ చేసిందని... తమ మిషన్ పూర్తి కాగానే పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు.
బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందిన 1980 సంవత్సరం నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే కొనసాగుతున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ కాన్స్టాంటినో చివెంగా ఇటీవల కాలంలో మాట్లాడుతూ, పార్టీలోని సీనియర్లను బలవంతంగా తొలగించడాన్ని మానుకోవాలని ముగాబేను డిమాండ్ చేశారు. గతం వారంలో ఉపాధ్యక్షుడు ఎమ్మర్సన్ ను డిస్మిస్ చేయడాన్ని తప్పుబట్టారు. తదుపరి అధ్యక్షుడు కావడానికి ఎమ్మర్సన్ ప్రయత్నిస్తుండటం గమనార్హం.
ఈ ఉదయం ముగాబేకు చెందిన ప్రైవేట్ నివాసంలో గన్ ఫైర్ జరిగింది. హరారేలో ఆర్మీ వాహనాలు మోహరించాయి. మిలిటరీ యాక్షన్ చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నాయని ప్రజలను మిలిటరీ చీఫ్ కూడా హెచ్చరించారు. ప్రస్తుతం ముగాబే ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అయితే, ఆయన క్షేమంగానే ఉన్నారని మిలిటరీ ప్రకటించింది.
వయసు మీద పడడంతో ఇటీవల కాలంలో ముగాబే మనిషి కాస్త తడబడుతున్నారు. ప్రసంగ సమయంలో కూడా మధ్యమధ్యలో ఆగిపోతున్నారు. ఈ నేపథ్యంలో, మరోసారి ఆయన అధ్యక్షుడు కావడం ఆర్మీ చీఫ్ కు ఇష్టం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే, జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మరోవైపు, జింబాబ్వేలోని తమ ప్రజలను హరారేలోని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. జింబాబ్వేలో పరిస్థితులు బాగోలేవని... సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.