araku: అర్థంతరంగా ఆగిపోయిన అరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- వర్షం కారణంగా ఆగిపోయిన ఫెస్టివల్
- బెలూన్లు ఎగరడానికి అనుకూలించని వాతావరణం
- నిరాశ వెలిబుచ్చిన పర్యాటకులు
ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక కేంద్రం అరకు లోయలో ప్రతిష్ఠాత్మకంగా నిన్న ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అర్థంతరంగా ఆగిపోయింది. వర్షం కారణంగా బెలూన్లు ఎగరడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఫెస్టివల్‌ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరగాల్సిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిలిపివేయడంతో పర్యాటకులు నిరాశ వెలిబుచ్చారు.
అరకు లోయలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో నిర్వాహకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్ వంటి 13 దేశాలకు చెందిన ఔత్సాహికులు హాజరయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ-ఫ్యాక్టర్, స్కైవాల్ట్జ్ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ నిర్వహణను చేపట్టింది.