Jagan: ఊరికి పది ప్రభుత్వ ఉద్యోగాలు... జగన్ కురిపించిన వరాల జల్లుల వివరాలివి!
- ప్రతి ఊరికీ 10 ప్రభుత్వ ఉద్యోగాలు
- దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో నిర్ణయం
- జన్మభూమి కమిటీలతో పనిలేకుండా చేస్తాం
- కర్నూలు జిల్లాలోకి జగన్ యాత్ర
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తన పాదయాత్ర 8వ రోజున వరాల వర్షం కురిపించారు. ఈ ఎనిమిది రోజుల్లో 100 కిలోమీటర్ల మైలురాయిని తాకిన ఆయన యాత్ర, కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడం, అక్కడ తనకు ప్రజల నుంచి లభించిన ఘన స్వాగతాన్ని చూసిన జగన్, పలు నూతన పథకాలను ప్రకటిస్తూ, తన పార్టీ అధికారంలోకి వస్తే, అన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు.
ప్రతి గ్రామంలో ఓ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని, పెన్షన్, రేషన్, ఇల్లు సహా అన్ని పథకాలనూ ఆ సచివాలయం కేంద్రంగా పూర్తి పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. ఏ పథకం కోసమైనా దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో కనీసం పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఆ ఉద్యోగాల్లో ప్రతి సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఉంటుందని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుండా, అర్హత ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు లభిస్తాయని మాట ఇచ్చారు.
జన్మభూమి కమిటీలు లంచాల కమిటీలుగా మారిపోయాయని విమర్శించిన జగన్, ఇటువంటి కమిటీలతో ఇకపై అవసరం ఉండదని అన్నారు. ఏ నేత పాలనలోనైనా రాష్ట్రం నాలుగడుగులు ముందుకు నడిచి అభివృద్ధి దిశగా సాగుతుందని, చంద్రబాబు హయాంలో మూడడుగులు వెనక్కి వెళుతోందని నిప్పులు చెరిగారు. కేసీ కెనాల్ కింద రాజోలి ప్రాజెక్టుకు వైఎస్ఆర్ రూ. 650 కోట్లు నిధులు కేటాయిస్తే, ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, వైకాపా అధికారంలోకి వస్తే, ఆ ప్రాజెక్టును పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. పేదల పింఛన్ ను రూ. 2 వేలకు పెంచుతామని, పింఛన్ వయసును కూడా 45 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపారు. ప్రజల ఆశీస్సులు తనకు కావాలని కోరారు.