‘శబరిమల’: ‘శబరిమల’ లో ఆధునిక వసతి సౌకర్యాలు!
- ప్రతిరోజూ 5 వేల మంది భక్తులకు భోజన ఏర్పాట్లు
- 2018 జనవరి 14 వరకూ కొనసాగుతుంది
- పంపా నది నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు మహిళా భక్తులకు ప్రత్యేక క్యూ
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఈ ఏడాది నుంచి ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా కేరళ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి సుందరన్ మాట్లాడుతూ, ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, ప్రతిరోజూ 5 వేల మంది భక్తులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమం 2018 జనవరి 14 మకర విళక్కు వరకూ కొనసాగుతుందని తెలిపారు.
మహిళా భక్తుల కోసం పంపా నది నుంచి అయ్యప్ప సన్నిధానం వరకూ ప్రత్యేక క్యూలైన్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, మండల పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యప్ప ఆలయాన్ని రేపటి నుంచి తెరవనున్నారు. గురువారం నుంచి సాధారణ వేళల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకునేందుకు అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు చెప్పారు.