Congress: పడవ బోల్తా ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ
- పడవ ప్రమాదంపై నిన్న నిజ నిర్ధారణ కమిటీ వేసిన ఏపీసీసీ
- పున్నమిఘాట్ వద్దకు వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కాంగ్రెస్ పార్టీ నేతలు
- టూరిజం శాఖ అధికారులే ప్రైవేట్ బోట్ ఎక్కమని ప్రోత్సహించడం ప్రభుత్వ వైఫల్యమే-ఏపీసీసీ
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడి 22 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమై ఉంటుందని భావిస్తోన్న ఏపీసీసీ నిజ నిర్ధారణ కమిటీని వేసింది. పడవ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఈ రోజు ఈ కమిటీ పరిశీలించింది. పున్నమిఘాట్ వద్ద కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ... పడవ బోల్తా ఘటనలో 22 మంది మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. టూరిజం శాఖ అధికారులే ప్రైవేట్ బోట్ ఎక్కమని ప్రోత్సహించడం ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. సేప్టీ నామ్స్ పాటించకపోవడమే పడవ ప్రమాదానికి కారణమని తెలిపారు.