rosogolla: రసగుల్లా పుట్టిల్లు పశ్చిమ బెంగాలే... భౌగోళిక గుర్తింపు కేంద్రం ప్రకటన!
- రెండున్నరేళ్లుగా రసగుల్లా విషయంలో గొడవపడుతున్న పశ్చిమ బెంగాల్, ఒడిశా
- 1868లో నబీన్ చంద్రదాస్ కనిపెట్టినట్లు రుజువులు చూపిన బెంగాల్
- తీపి కబురంటూ మమత ట్వీట్
రెండున్నరేళ్లుగా రసగుల్లా స్వీట్ గురించి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదానికి ఇవాళ తెరపడింది. రసగుల్లా పశ్చిమ బెంగాల్‌లోనే తయారైందని తెలియజేస్తూ చెన్నైలోని భౌగోళిక గుర్తింపు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్రం పేరు మీదే గుర్తింపును నమోదు చేసినట్లు వెల్లడించింది.
ఈ విషయం గురించి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం లండన్‌లో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. 'మనందరికీ ఓ తీపి కబురు. రసగుల్లా విషయంలో బెంగాల్‌కి భౌగోళిక గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది' అని ఆమె ట్వీట్ చేశారు. గతంలో జాయ్‌నగ్యారెర్ మోవా స్నాక్ భౌగోళిక గుర్తింపు విషయంలోనూ తాము వేరే రాష్ట్రంతో పోరాడాల్సి వచ్చిందని బెంగాల్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి అబ్దుర్ రజాక్ మొల్లా తెలిపారు.
ఒడిశాలోని పూరీలో పుట్టిన ఖీర్ మొహానా, కాలంతో పాటు రసగుల్లాగా మారిందని ఒడిశా వాదించింది. కానీ 1868లోనే బెంగాలీ స్వీట్ తయారీదారుడు నబీన్ చంద్రదాస్ రసగుల్లాను తయారు చేసినట్లు బెంగాల్ రుజువులు చూపించడంతో రసగుల్లాకు బెంగాల్ పేరిట భౌగోళిక గుర్తింపును అందజేశారు.