Chandrababu: పట్టణాల్లో 5,39,586, గ్రామీణ ప్రాంతాల్లో 13,06,555 ఇళ్లు నిర్మిస్తున్నాం: అసెంబ్లీలో చంద్రబాబు
- కాంగ్రెస్ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయి
- ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయిస్తాం
- సొంతిళ్లు ఉండాలన్న ప్రజల కలను నెరవేర్చుతాం
- తిరుపతిలో మరో 4500 ఇళ్లు జనవరిలోపు పూర్తి చేస్తాం
సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ... సొంతిళ్లు ఉండాలన్న ప్రజల కలను తాము నెరవేర్చుతామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయిస్తామని అన్నారు.
తిరుపతిలో 2388 ఇళ్లను నాలుగు బ్లాక్‌ల కింద పూర్తి చేశామని, తిరుపతిలో మరో 4500 ఇళ్లు జనవరిలోపు పూర్తి చేస్తామని తెలిపారు. తిరుపతిలో ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా వందకోట్టు ఖర్చుపెట్టామని అన్నారు. ఏడాదికి మూడుసార్లు గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. పట్టణాల్లో మొత్తం 5,39,586 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,06,555 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.