chris gayle: 3,00,000 డాలర్లు ఇవ్వండి... నా దగ్గర ఆసక్తికర విషయం ఉంది చెబుతా!: మీడియాతో క్రికెటర్ గేల్ బేరం
- అక్టోబర్ చివరి వారంలో మీడియా సంస్థలపై పరువునష్టం కేసు గెలిచిన గేల్
- ఈ కేసు గురించి చెప్పేందుకు తనవద్ద ఆసక్తికర విషయం ఉందంటున్న గేల్
- సీక్రెట్ చెప్పాలంటే 3,00,000 డాలర్లు కావాలన్న గేల్
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మీడియాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన దగ్గర ఆసక్తికర విషయం ఉందని, 3,00,000 డాలర్లు ఇస్తే ఆ విషయం మీడియాకు చెబుతానని బేరంపెట్టాడు. దాని వివరాల్లోకి వెళ్తే... 2015 ప్రపంచకప్ సమయంలో ఆస్ట్రేలియా మహిళా మసాజ్ థెరపిస్టు ముందు అసభ్యంగా ప్రవర్తించాడని ఫెయిర్ ఫాక్స్ మీడియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్ పత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన గేల్ పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసు విచారణలో తుది తీర్పు గత అక్టోబర్ చివరి వారం వెలువడింది. ఈ కేసులో తీర్పు గేల్ కు అనుకూలంగా వచ్చింది.
ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు గేల్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించాయి. దీంతో ఊరికే ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలని భావించిన గేల్... ఇప్పుడు తన ఇంటర్వ్యూను అమ్మకానికి పెట్టాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది చెప్పడానికి తాను సిద్ధమని అన్నాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన గేల్... ‘మీకు చెప్పేందుకు నా వద్ద ఓ ఆసక్తికర కథనం ఉంది!! ఇది చెప్పేందుకు ప్రత్యేకంగా 60 నిమిషాలు పడుతుంది. నా తర్వాత పుస్తకంలో ప్రచురించే వరకు ఎందుకు ఆగడం చెప్పండి! నాకు 3,00,000 డాలర్లు ఇస్తే ఇంటర్వ్యూ ఇచ్చేస్తా’ అంటూ బేరసారాలకు దిగాడు. దీనిని చూసినవారు క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాడని, మీడియా సంస్థలకు రేటింగ్ కావాలనుకుంటే కొనుక్కుంటాయని పేర్కొంటున్నారు.