‘జబర్దస్త్’: ప్యాంటు, షర్ట్స్ ధరించడం తక్కువ .. లేడీస్ ఐటెమ్స్ కొనడం ఎక్కువ: ‘జబర్దస్త్’ నటుడు శాంతి స్వరూప్
- నటి సౌందర్య చీరకట్టు ఇష్టం
- అలానే, రోజా చీరకట్టుకునే విధానం, హెయిర్ స్టైల్ ని అనుసరిస్తా
- ‘జబర్దస్త్’లో స్త్రీ పాత్రధారి.. నటుడు శాంతి స్వరూప్
‘జబర్దస్త్’లో లేడీ పాత్రల్లో నటించేటప్పుడు తాను ధరించే డ్రెస్సులకు చాలా ప్రాధాన్యమిస్తానని శాంతి స్వరూప్ అన్నాడు. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ, ‘దివంగత నటి సౌందర్య గారంటే నాకు చాలా ఇష్టం. ఆమె అభిమానిని కూడా. ఆమె సినిమాలు ఎక్కువగా చూస్తా. ఆమెతో కలిసి ఓ సినిమాలో అయినా సరే నటించాలని అనుకునే వాడిని. కానీ, దురదృష్టవశాత్తు ఆమె చనిపోయారు.
షో నిమిత్తం చీర ధరించేటప్పుడు ఇప్పటికీ సౌందర్యనే నేను అనుసరిస్తా. అలా అని చెప్పి.. సౌందర్యతో నేను పోల్చుకోవడం లేదు! ఆమె డ్రెస్సులు ఎంతో పద్ధతిగా ఉంటాయి. అలానే, సినీ నటి రోజాగారు చీర కట్టుకునే విధానం, హెయిర్ స్టైల్ కూడా నేను అనుసరిస్తా. ‘జబర్దస్త్’లో నేను లేడీ పాత్రలే పోషిస్తున్నాను కాబట్టి, మహిళల చీర కట్టు, బొట్టు, హెయిర్ స్టైల్ ను గమనిస్తూ ఉంటా.
‘జబర్దస్త్’లో నేను ఏ డ్రెస్సులు ధరించాలనే విషయం నాకే వదిలేస్తారు. షో నిమిత్తం నెలలో 20 రోజులు చీరలు ధరించే ఉంటా. వాస్తవం చెప్పాలంటే.. ప్యాంటు, షర్ట్స్ ధరించడం తక్కువై పోయింది.. లేడీస్ ఐటెమ్స్ కొనడం ఎక్కువైపోయింది' అని చెప్పుకొచ్చాడు.