kodela siva prasad rao: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి స్పీకర్ కోడెల స్పందన!
- కేసు సుప్రీంకోర్టులో ఉంది
- ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయగలను?
- నేను నిర్ణయం తీసుకోక ముందే వైసీపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారు
వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు వినతి పత్రాన్ని కూడా స్పీకర్ కు అందజేశారు. దీనిపై తాజాగా కోడెల స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తనను కోరారని... అయితే, దీనికోసం తాను ఓ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ అంశంపై తాను నిర్ణయం తీసుకోక ముందే వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారని, అక్కడ పిటిషన్ ను కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారని... సుప్రీంకోర్టు దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిందని చెప్పారు. అక్కడ తీర్పు వెలువడాల్సి ఉందని... కేసు సుప్రీంకోర్టులో ఉంటే తాను నిర్ణయం ఎలా తీసుకోగలనని ప్రశ్నించారు.
ఫిరాయింపు కారణాన్ని చూపుతూ, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని వైసీపీ నేతలు చెప్పడం బాధాకరమని కోడెల అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని వారు అంటున్నారని... అయితే, ఎన్టీఆర్ తానొక్కరే అసెంబ్లీని బహిష్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారని... చివరి రోజు వరకు సభలో తమ వాదనను వినిపించారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు తాను ఫోన్ చేశానని తెలిపారు.