hackers: ప్రతి రోజూ ఆరు లక్షల వైరస్ లు పుట్టుకొస్తున్నాయి.. అప్రమత్తంగా లేకపోతే అంతేసంగతులు!: పెండ్యాల కృష్ణశాస్త్రి

  • ఏటా పది లక్షల కోట్ల డాలర్ల సైబర్ నేరాలు
  • పేస్ మేకర్లను కూడా హ్యాక్ చేస్తున్నారు
  • మన వాయిస్ రికార్డ్ చేసి, విదేశాలకు పంపుతున్న వాక్యూమ్ క్లీనర్లు

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ వ్యక్తిగత సమాచారానికి భద్రత అన్నది లేకుండా పోతోంది. రకరకాల గ్యాడ్జెట్స్ కు మనం దాసోహమవుతున్న కొద్దీ మన డేటాకు రక్షణ లేకుండా పోతోంది. సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ ఆరు లక్షల కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ విషయాలను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ మాజీ అధికారి, పీడబ్ల్యూసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెండ్యాల కృష్ణశాస్త్రి వెల్లడించారు. విశాఖ ఏయూ ఫార్మా కళాశాలలో ‘ట్రెండ్స్‌ ఇన్‌ సైబర్‌ ఎటాక్స్‌ స్ర్టాటజీస్‌ టు కంబాట్‌’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికతో మాట్లాడుతూ, ఆయన పలు విషయాలను వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా పది లక్షల కోట్ల డాలర్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. హ్యాకర్లు ఎక్కడ ఉంటారు? ఎంత మంది ఉంటారు? అనేది ఎవరికీ అర్థం కాదని అన్నారు. కంప్యూటర్లనే కాకుండా సీసీ కెమెరాలను, చివరకు మన శరీరంలో అమర్చే పేస్ మేకర్లను కూడా హ్యాక్ చేసేస్తున్నారని చెప్పారు. ఇంట్లో వాడుతున్న వాక్యూమ్ క్లీనర్ కూడా మన వాయిస్ ను రికార్డ్ చేసి, మరో దేశానికి పంపుతున్నట్టు మూడు రోజుల క్రితం బయటపడిందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ హ్యాకర్లంతా మేధావులు కాదని... వారిలో కనీసం పదో తరగతి కూడా పాస్ కాని వారు ఉంటారని చెప్పారు. హ్యాకర్లను అధిగమించాలంటే మనం వారికన్నా ఒక అడుగు ముందుండాలని అన్నారు.

హ్యాకర్లు మన కంప్యూటర్లను హ్యాక్ చేసి, డేటాను తస్కరిస్తారని... ఆ డేటాను మనం తిరిగి పొందాలంటే వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పెండ్యాల తెలిపారు. డబ్బు లావాదేవీలు నేరుగా జరగవని... అంతా ఆన్ లైన్లోనే జరుగుతుందని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ వర్చువల్ కరెన్సీ (బిట్ కాయిన్స్ లాంటివి) రూపంలోనే ఉంటాయని... ఒక్కో బిట్ కాయిన్ విలువ ఆరు వేల డాలర్ల వరకు ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో కేవలం 21 మిలియన్ల బిట్ కాయిన్స్ మాత్రమే ఉన్నందున... వీటి విలువ రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. సైబర్ దాడులు జరిగే పది రోజుల ముందు వీటి విలువ అమాంతం పెరుగుతుంటుందని అన్నారు.

నూటికి నూరు శాతం సైబర్ దాడుల నుంచి రక్షణ పొందడం ఎవరికీ సాధ్యం కాదని పెండ్యాల తెలిపారు. ఇంగ్లండ్ లో 14 ఏళ్ల లోపువారు ఫేస్ బుక్ వాడకుండా నిషేధించారని... ఇలాంటి విధానం మన దేశంలో కూడా రావాలని అన్నారు. గతంలో ప్రొటెక్ట్, డిటెక్ట్, రెస్పాండ్ విధానాన్ని పాటించేవాళ్లమని, ఇప్పుడు డిటెక్ట్, రెస్పాండ్, ప్రొటెక్ట్ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News