raghu veera reddy: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఈ రోజు పిండ ప్రదానం చేశాం: రఘువీరారెడ్డి
- పాతనోట్ల రద్దుకి నేటికి ఏడాది
- రూ.1000లు, రూ.500లు నోట్లకు మొదటి వర్థంతి
- పెద్దనోట్ల రద్దుతో అవినీతి రెట్టింపు అయిపోయింది
- మోదీ నిర్ణయంతో జీడీపీ తగ్గిపోయింది
- చంద్రబాబు, జగన్ ఇకనైనా నోరు విప్పాలి
సరిగ్గా సంవత్సరం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కున్నారని ఆరోపిస్తూ విజయవాడలో ఏపీసీసీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఇది ఒక పెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పెద్దనోట్ల రద్దుతో అవినీతి రెట్టింపు అయిపోయిందని అన్నారు.
తీవ్రవాదం ఏమీ తగ్గలేదని, వందల మంది సిపాయిలు బోర్డర్లో రోజు చనిపోతున్నదే అందుకు నిదర్శనమని రఘువీరారెడ్డి తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో అప్పట్లో క్యూలైన్లో 121 మంది చనిపోయారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అని చెప్పి, అంత కంటే పెద్దైన రూ.2 వేల నోటును తీసుకువచ్చారని, దోచుకోవడానికి, దాచుకోవడానికి మరింత వెసులుబాటు కల్పించారని అన్నారు. వ్యవసాయం కుదేలయిపోయిందని, చిన్న చిన్న వ్యాపారాలు బంద్ అయిపోయాయని చెప్పారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సలహా వల్లనే నోట్ల రద్దు అన్నారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇంత వరకు నోట్ల రద్దు గురించి, నష్టాల గురించి మాట్లాడలేదని ఆరోపించారు. ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థతో జీడీపీ 2 శాతం తగ్గిపోయిందని అన్నారు. నేరుగా 2 లక్షల కోట్ల రూపాయల మేర ఈ దేశానికి, ప్రజలకు నష్టం జరిగిందని అన్నారు. పుండు మీద కారం జల్లినట్లు, ఇది చాలదు అన్నట్లు ప్రజలకు మరింత నష్టం కలిగించే జీఎస్టీని తీసుకువచ్చారని అన్నారు.
అందుకోసమే తాము ప్రధాని మోదీ ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హుడు కాడని అంటున్నామని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. 'తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏమిటి..? జగన్ పార్టీ స్టాండ్ ఏమిటి..? ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు..? మోదీ గారు మీకు ఫోన్ చేసి దీని గురించి మాట్లాడవద్దు అని చెప్పారు. అది మాకు ఉన్న సమాచారం. అందుకే మీరు మాట్లాడటం లేదు. ప్రజలకు నష్టం కలుగుతున్నా..ఈ పార్టీలు కుమ్మక్కు అయ్యి ప్రతి రోజు వంచన చేస్తావుంటే... ద్రోహం చేస్తోంటే కాంగ్రెస్పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు దేశం మొత్తంగా చీకటి రోజును ఆచారిస్తున్నా'మని వ్యాఖ్యానించారు.
రూ.1000లు, రూ.500లు నోట్లకు మొదటి వర్థంతిని చేస్తున్నామని రఘువీరారెడ్డి అన్నారు. అలాగే పిండ ప్రదానం చేశామన్నారు. ఇప్పటికైనా జాతికి ప్రధాని క్షమాపణ చెప్పి, జరిగిన నష్టానికి, నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించి పాలన కొనసాగించాలన్నారు. అలాగే తెలుగుదేశం, జగన్ పార్టీ కూడా దీని మీద నోరు విప్పాలని, లేకపోతే ఈ నేరంలో మీరూ భాగస్వామ్యులే అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నోట్ల రద్దుతో మరణించిన వారికి శాంతి కలగాలని ఈ రోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నామని చెప్పారు.