modi: కఠోర సత్యం... 33 శాతం డబ్బు డిపాజిట్లు 0.00011 శాతం ప్రజల నుంచే!
- నోట్ల రద్దు తరువాత డిపాజిట్ లెక్కలు
- దినపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చిన మోదీ ప్రభుత్వం
- రాళ్ల దాడి ఘటనలు 75 శాతం తగ్గాయని వెల్లడి
- 35 వేల షెల్ కంపెనీలను గుర్తించామన్న సర్కారు
గత సంవత్సరం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దును ప్రకటించిన తరువాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం కరెన్సీలో 33 శాతం డబ్బు కేవలం 0.00011 శాతం మంది నుంచి మాత్రమే వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని నల్లధనాన్ని వెలికితీసేందుకు జరిగిన అతిపెద్ద ప్రయత్నం ఇదని చెబుతూ, మోదీ ప్రభుత్వం నేడు వివిధ దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనను ఇచ్చింది.నోట్ల రద్దు తరువాత వచ్చిన లాభాలను ఈ ప్రకటన ఉటంకించింది.
ఉగ్రవాద వ్యతిరేకత నుంచి ఉద్యోగ సృష్టి వరకూ ఈ నోట్ల రద్దు పాజిటివ్ ప్రభావాన్ని చూపించిందని, ఈ ప్రకటనలో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. కాశ్మీర్ లో 75 శాతం రాళ్లదాడి ఘటనలు తగ్గిపోయాయని, వామపక్ష తీవ్రవాదం 20 శాతం తగ్గిందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థను శుభ్రపరిచామని వెల్లడించింది. 2.24 లక్షల షెల్ కంపెనీలను గుర్తించామని, 35 వేలకు పైగా కంపెనీలు 58 వేల బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 17 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించామని వెల్లడించింది. ప్రజలు సహకరించబట్టే ఇదంతా జరిగిందని పేర్కొంది