పరుచూరి గోపాలకృష్ణ: అప్పుడు, కృష్ణ ఫ్యాన్స్ నా బుగ్గలు కొరికేశారు: పరుచూరి గోపాలకృష్ణ
- కృష్ణ నటించిన ‘ఈనాడు’ గురించి ప్రస్తావన
- డైలాగ్స్ బాగున్నాయనే ఆనందంతో ఫ్యాన్స్ నా బుగ్గలు కొరికేశారు
- దండం పెట్టి ‘ఆగండయ్యా బాబు’ అనాల్సి వచ్చింది
- ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ నాటి సినిమా‘ఈనాడు’కు మాటలు పరుచూరి బ్రదర్స్ రాసిన విషయం తెలిసిందే. 1980లలో విడుదలైన ఈ సినిమా గురించి ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ ప్రస్తావించారు. ‘‘ఈనాడు’ సినిమాను రిలీజ్ రోజునే విజయవాడలో కృష్ణ గారితో కలసి చూశాం. ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి గుంటూరు వెళ్లాం. ‘ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది వీళ్లే’ అంటూ కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు మమ్మల్ని పరిచయం చేశారు.
అంతే, ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయనే ఆనందంతో అక్కడున్న కృష్ణ ఫ్యాన్స్ నా బుగ్గలు కూడా కొరికేశారు. ఆ సంగతి నేను మర్చిపోలేను. వాళ్లకు దండం పెట్టి ‘ఆగండయ్యా బాబు’ అనాల్సి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్, డ్యూయెట్స్ లేకపోవడంతో ఎలా ఉంటుందోనని అభిమానులు వణికిపోయారు. కానీ, ఈ సినిమా నాడు చరిత్ర సృష్టించింది.. రికార్డులన్నీ తిరగరాసింది. ఎన్టీఆర్ గారు తర్వాత అంతగా మేము గౌరవించే వ్యక్తి కృష్ణ గారు’ అని గోపాలకృష్ణ అన్నారు.