వాణి విశ్వనాథ్: వ్యక్తిగతంగా ఎమ్మెల్యే రోజాకి, నాకు ఎటువంటి పోటీ లేదు: వాణి విశ్వనాథ్
- ఈ రోజు చంద్రబాబును కలిసే అవకాశం ఉంది
- ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే భాష ముఖ్యం కాదు
- నాకు తెలుగు బాగా రాకపోవడం సమస్యేం కాదు
- పాపాలు పోతాయని జగన్ పాదయాత్ర చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న అభివృద్ధిలో పాలు పంచుకుంటానని సీనియర్ నటి వాణి విశ్వనాథ్ అన్నారు. ఈ రోజు ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే రోజాని ఎదుర్కోగలనన్న నమ్మకం తనలో ఉందని అన్నారు. ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే భాష ముఖ్యం కాదని, తనకు తెలుగు బాగా రాకపోవడం అన్నది సమస్యేం కాదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే రోజాకి, తనకు ఎటువంటి పోటీ లేదని వాణి విశ్వనాథ్ అన్నారు. ఈ రోజు చంద్రబాబుని కలిసే అవకాశం ఉందని చెప్పారు.
పార్టీలో చేరిన తరువాతే మిగతా విషయాల గురించి మాట్లాడతానని, మొదట ఆ పార్టీలో చేరాల్సి ఉందని చెప్పారు. పాదయాత్ర చేస్తే వారి పాపాలు పోతాయని, అందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని వాణి విశ్వనాథ్ ఎద్దేవా చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ తనను రాజకీయాల్లోకి రావాలని కోరలేదని, రాజకీయాలంటే ఇష్టమా? అని మాత్రమే అడిగారని అన్నారు. సినిమాల్లోనే నటించాలని మాత్రమే ఉందని అన్నానని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే మీ పార్టీలోనే చేరతానని ఎన్టీఆర్‌కి చెప్పానని వ్యాఖ్యానించారు.